Bharat ratna Lal Krishna Advani : ‘రామ రథ’ సారథి!
ABN , Publish Date - Feb 04 , 2024 | 04:41 AM
లాల్ కృష్ణ ఆడ్వాణీ.. భారత రాజకీయాల్లో పరిచయమే అక్కర్లేని పేరు.. బీజేపీకి అగ్ర నేతగానే కాదు.. రామజన్మభూమి ఉద్యమానికి రాజకీయ రూపం తీసుకొచ్చి.. దేశ లౌకికవాద రాజకీయాల్లోకి ‘హిందూత్వ’ను చొప్పించిన నాయకుడిగా విమర్శలపాలైనా.. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ శ్రేణుల గౌరవం మాత్రం ఇతోధికంగా
రామజన్మభూమి ఉద్యమానికి రాజకీయ రూపునిచ్చిన ఆడ్వాణీ
‘హిందూత్వ’ను ప్రధాన ఎజెండాగా మార్చేసిన బీజేపీ అగ్ర నేత
రెండు సీట్ల నుంచి అధికారంలోకి తెచ్చిన ఘనత.. ఆరెస్సెస్‌కు ఇష్టుడు
జిన్నాను పొగిడి తెరమరుగు.. నరేంద్ర మోదీ రాకతో మసకబారిన ప్రభ
లాల్ కృష్ణ ఆడ్వాణీ.. భారత రాజకీయాల్లో పరిచయమే అక్కర్లేని పేరు.. బీజేపీకి అగ్ర నేతగానే కాదు.. రామజన్మభూమి ఉద్యమానికి రాజకీయ రూపం తీసుకొచ్చి.. దేశ లౌకికవాద రాజకీయాల్లోకి ‘హిందూత్వ’ను చొప్పించిన నాయకుడిగా విమర్శలపాలైనా.. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ శ్రేణుల గౌరవం మాత్రం ఇతోధికంగా సంపాదించారు. 1984లో కేవలం రెండు లోక్‌సభ సీట్లు ఉన్న పార్టీని.. తన కష్టంతో.. వ్యూహచాతుర్యంతో అనతికాలంలోనే బలోపేతం చేసి.. 1996లో ఏకైక అతిపెద్ద పార్టీగా.. 1998, 99ల్లో అధికార పార్టీగా ఎదిగేలా చేశారు. రామజన్మభూమికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాదు.. సోమ్‌నాథ్ నుంచి అయోధ్య వరకు రామ రథయాత్ర చేపట్టి.. రామాలయ నిర్మాణాన్ని బీజేపీ ప్రధాన ఎజెండాగా మార్చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. బీజేపీని కాంగ్రెస్, వామపక్షాలు అంటరాని పార్టీగా చూసినా.. సమతా పార్టీ, జనతాదళ్ వంటి సోషలిస్టు పార్టీలు దానిని అక్కున చేర్చుకునేలా చేశారు. తన సారథ్యంలో బీజేపీ గెలిచినా.. ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజపేయిని ప్రతిపాదించి.. తనకు పదవీలాలస లేదని.. పదవుల కంటే పార్టీయే మిన్నని చాటారు. హిందీ రాష్ట్రాల్లో సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేయడానికి ఎంతో కృషిచేశారు. మచ్చలేని నాయకుడు. హవాలా కుంభకోణం దేశాన్ని ఊపేసినప్పుడు.. సదరు డైరీల్లో తన పేరు ఉండడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కోర్టులో కేసు తేలేవరకు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు. పాకిస్థాన్‌లో తన జన్మస్థానమైన కరాచీ వెళ్లి.. ద్విజాతి సిద్ధాంతకర్త, మతప్రాతిపదికన దేశం విడిపోవడానికి కారణమైన ముస్లింలీగ్ వ్యవస్థాపకుడు మహ్మదాలీ జిన్నాను లౌకికవాది అని పొగిడి సంఘ్ ఆగ్రహాన్ని చవిచూశారు. దాని ఫలితంగానే క్రమంగా తెరమరుగయ్యారు. సంఘ్ 2014లో ఆయన్ను కాదని.. ఆయన శిష్యుడైన గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని జాతీయ యవనికపైకి తేవడంతో ఆయన ప్రభ మసకబారింది. గత ఐదేళ్లుగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయనకు మోదీ ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించి విస్మయానికి గురిచేసింది.
ఈ జీవితం దేశానికి అంకితం
రాష్ట్రపతి ముర్ము, మోదీకి ఆడ్వాణీ ధన్యవాదాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఈ జీవితం నాది కాదు.. దేశానిది (ఇదం నమమ)’’ అన్న సంస్కృత సూక్తే నాకు ప్రేరణ. 14వ ఏట ఆర్‌ఎ్‌సఎ్‌సలో చేరా. నా ప్రియమైన దేశం కోసం ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో సేవలందించా. దశాబ్దాల ఈ నిస్వార్థ సేవకు ప్రతిఫలం లభించింది. వ్యక్తిగతంగానే కాదు.. నా అశయాలు, సిద్ధాంతాలకు గౌరవం దక్కింది’’ అని అన్నారు బీజేపీ కురు వృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ. ‘భారత రత్న’ ప్రకటన అనంతరం ఆయన ఓ ప్రకటనలో స్పందించారు. అత్యంత వినయంతో ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను అత్యంత సన్నిహితంగా పనిచేసిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధాని వాజపేయీని స్మరించుకున్నారు. కుటుంబం, లక్షలాది మంది పార్టీ, సంఘ్ కార్యకర్తలతో పాటు భార్య దివంగత కమలా ఆడ్వాణీని గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. వారందించిన మానసిక స్థైర్యంతోనే ప్రజాసేవలో కొనసాగినట్లు వివరించారు. అభివృద్ధిలో భారతదేశం వైభవోన్నతంగా ముందుకుసాగాలని ఆడ్వాణీ ఆకాంక్షించారు.
ప్రజా సేవకు గొప్ప గుర్తింపు: ఆడ్వాణీ కుటుంబం
ఆడ్వాణీకి భారతరత్న ప్రకటన పట్ల ఆయన కుటుంబం అత్యంత ఆనందించింది. జీవితాంతం అందించిన ప్రజా సేవకు గొప్ప గుర్తింపు లభించిందని పేర్కొంది. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది. దేశ అత్యున్నత పురస్కారం దక్కిన సంగతి తెలిసి తన తండ్రి కళ్లలో ఆనందభాష్పాలు రాలాయని ఆడ్వాణీ కుమారుడు జయంత్ చెప్పారు. ఢిల్లీలోని నివాసంలో తండ్రికి కుమార్తె ప్రతిభా ఆడ్వాణీ లడ్డూ తినిపించారు. ఈసమయంలో తన తల్లి లేకపోవడం ఒక్కటే లోటని అన్నారు.
జీవిత విశేషాలు..
ఆడ్వాణీ 1927 నవంబరు 8న కరాచీలో పుట్టారు.
1942లో 14వ ఏట ఆరెస్సెస్‌లో చేరారు.
1947 సెప్టెంబరులో దేశ విభజన విద్వేషాలు ప్రజ్వరిల్లిన సమయంలో కట్టుబట్టలతో పాకిస్థాన్ నుంచి తప్పించుకుని రైలులో ఢిల్లీ చేరుకున్నారు.
ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తగా రాజస్థాన్‌లో పనిచేశారు. గాంధీజీ హత్యానంతరం ఆరెస్సెస్‌ను నిషేధించినప్పుడు అజ్ఞాత వాసం గడిపారు.
తర్వాత సంఘ్ మార్గదర్శకత్వంలో ఏర్పాటైన భారతీయ జనసం్‌ఘలో చేరారు. అప్పటికే జనసంఘ్ తరఫున లోక్‌సభ సభ్యుడిగా ఉన్న అటల్ బిహారీ వాజపేయికి సహాయకుడిగా పనిచేసేందుకు 1957లో ఢిల్లీ వచ్చారు.
1965లో కమలను వివాహం చేసుకున్నారు.
1972లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక.
ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో 1975 జూన్‌లో వాజపేయితో పాటు అరెస్టు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచాక మొరార్జీ ప్రభుత్వంలో 1977 మార్చి నుంచి 1979 జూలై వరకు కేంద్ర సమాచార మంత్రిగా బాధ్యతలు.
1980లో బీజేపీ స్థాపనలో కీలక భూమిక. 1986లో వాజపేయి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక. 1991 వరకు కొనసాగిన ఆడ్వాణీ.
1989 ఎన్నికల్లో బీజేపీ 85 సీట్లలో విజయం. వీపీ సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్‌కు మద్దతు.
రామాలయ నిర్మాణం డిమాండ్‌తో 1990 సెప్టెంబరు 25న సోమనాథ్ నుంచి అయోధ్యకు రామ రథయాత్రకు శ్రీకారం. రోజుకు 300 కి.మీ. చొప్పున ప్రయాణం.
1990 అక్టోబరు 24న బిహార్లోని సమస్తిపూర్‌లో ఆడ్వాణీ అరెస్టు. మతకల్లోలాలకు యాత్ర ఆజ్యం పోస్తోందంటూ నాటి సీఎం లాలూప్రసాద్ రథ యాత్రను అడ్డుకున్నారు.
1991 లోక్‌సభ ఎన్నికల్లో 120 సీట్లలో బీజేపీ ఘనవిజయం. ప్రధాన ప్రతిపక్షంగా అవతరణ.
1992 డిసెంబరు 6న అయోధ్యలో కరసేవ సందర్భంగా.. ఆడ్వాణీ, వాజపేయి, ఇతర బీజేపీ అగ్ర నేతల సమక్షంలోనే బాబ్రీమసీదు కూల్చివేత ఘటన.
1993 నుంచి 98 వరకు మళ్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక. 1996 ఎన్నికల్లో తొలిసారి బీజేపీ 161 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరణ. ప్రధానిగా వాజపేయి ప్రమాణం. సాధారణ మెజారిటీ కూడగట్టుకోలేక పదవికి రాజీనామా.
1998 ఎన్నికల్లో 182కి పెరిగిన బీజేపీ ఎంపీ స్థానాలు. ఇతర పార్టీలతో ఎన్‌డీఏ ఏర్పాటుచేసి గద్దెనెక్కిన వాజపేయి. హోం మంత్రిగా ఆడ్వాణీ బాధ్యతలు.
1998-2004 వరకు కేంద్ర హోం మంత్రిగా.. 2002 నుంచి 2004 వరకు దేశ ఉపప్రధానిగా ఆడ్వాణీ.
2009-14 నడుమ ప్రధాన ప్రతిపక్ష నేత.
2013లో బీజేపీ ఎన్నికల ప్రచార సారథిగా గుజరాత్ సీఎం మోదీని ప్రతిపాదించిన సంఘ్. వ్యతిరేకించిన ఆడ్వాణీ.
2014లో బీజేపీకి తొలిసారి లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ. మోదీ ప్రధానిగా ఎన్నిక. ఆడ్వాణీ లోక్‌సభకు ఎన్నికైనా.. ఎలాంటి పదవీ ఇవ్వని మోదీ.
తాజాగా భారతరత్న పురస్కారం ప్రకటన.
అంకితభావం అంటే ఆడ్వాణీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే ఆడ్వాణీకి దేశ ‘భారత రత్న’ ప్రకటించడం పట్ల ఆ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి ఎనలేని సేవలందించిన తమ మార్గనిర్దేశకుడికి తగిన గౌరవం లభించిందంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడ్వాణీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేశానికి, పార్టీకి ఆడ్వాణీ అందించిన సేవలు వెలకట్టలేనివని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత రాజకీయాల్లో ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప రాజకీయవేత్త ఆడ్వాణీకి భారతరత్న ప్రకటించడం కోట్లాది మంది దేశ ప్రజలకు దక్కిన గౌరవం అని అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో అంకిత భావం అంటే ఎల్‌కే ఆడ్వాణీయేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆడ్వాణీ అందించిన సేవలు చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. స్వాతంత్య్రం తర్వాత దేశ పునర్నిర్మాణంలో ఆడ్వాణీ పాత్ర కీలకమని, నిష్పక్షపాతానికి ఆడ్వాణీ నిదర్శనమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన ‘నేషనల్ హీరో’ ఆడ్వాణీకి భారతరత్నతో తగిన గౌరవం లభించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. తన లాంటి ఎందరో సామాన్య కార్యకర్తలకు మార్గదర్శి, లక్షలాది మందికి స్ఫూర్తిప్రదాత అయిన ఆడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. ఆడ్వాణీ నైతిక విలువలు, నిబద్ధతకు తిరుగులేని నిదర్శనమని బీజేపీ నేత, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అభిప్రాయపడ్డారు. ఆడ్వాణీ ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు.
ఇది భావోద్వేగ క్షణం: మోదీ
ఆడ్వాణీకి భారత రత్న ప్రకటించిన సమయం తనకు ఎంతో భావోద్వేగం కలిగించిన క్షణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ పురస్కారం గురించి ఆడ్వాణీతో స్వయంగా మాట్లాడి అభినందించానని ఎక్స్‌లో పోస్టు చేశారు. మన కాలంలో అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞుడు, దేశ అభివృద్ధికి చరిత్రాత్మకమైన పాత్ర పోషించిన నాయకుడు ఆడ్వాణీ అని కొనియాడారు. ఆయన జీవితం అట్టడుగు స్థాయి నుంచి దేశానికి సేవ చేయడం ప్రారంభించి ఉప ప్రధానిగా ఎదిగారన్నారు. ఆడ్వాణీ నుంచి నేర్చుకునేందుకు తనకు లెక్కలేనన్ని అవకాశాలు రావడం తన అదృష్టమన్నారు.
- సెంట్రల్ డెస్క్