Share News

మత విశ్వాసులతో కలిసి పనిచేద్దాం

ABN , Publish Date - Nov 08 , 2024 | 03:06 AM

కమ్యూనిస్టులు అంటేనే మత భావనలకు వ్యతిరేకంగా హేతుబద్ధ వైఖరిని అనుసరించేవారని అర్థం.

మత విశ్వాసులతో కలిసి పనిచేద్దాం

‘ఆర్‌ఎస్‌ఎస్‌’లా వారిలోకి మనమూ చొచ్చుకెళదాం

రాజకీయ ముసాయిదా పత్రంలో ప్రతిపాదించిన సీపీఎం నాయకత్వం

న్యూఢిల్లీ, నవంబరు 7: కమ్యూనిస్టులు అంటేనే మత భావనలకు వ్యతిరేకంగా హేతుబద్ధ వైఖరిని అనుసరించేవారని అర్థం. అయితే, మతం విషయంలో కొన్ని మినహాయింపులతో తన రాజకీయ తీర్మాన ముసాయిదా పత్రాన్ని సీపీఐ (ఎం) అగ్రనాయకత్వం సిద్ధం చేసింది. మత ఆచరణ కలిగినవారితోనూ కలిసి పనిచేయాలనీ, వారిని క్రమంగా పార్టీ నిర్మాణంలోకి తెచ్చుకోవాలంటూ.. తొలిసారి తన రాజకీయ వైఖరిలో స్పష్టమైన మార్పును ప్రదర్శించింది. మతం విషయంలో.. కాంగ్రెస్‌ సహా బీజేపీయేతర పార్టీలకు తాను భిన్నమనేది వివరించేందుకు ఈ పత్రంలో ప్రయత్నించింది. అదే సమయంలో సోషలిజం సాధనను, వామపక్షాల ఐక్యతను ఇప్పటికీ అత్యవసరంగా సాధించాల్సిన ఆదర్శ లక్ష్యాలుగా స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జరిగే 24వ మహాసభల (కాంగ్రెస్‌) కోసం ఇలాంటి అంశాలతో రాజకీయ ముసాయిదా పత్రాన్ని ఆ పార్టీ రూపొందించింది. ‘‘మతాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించడం కమ్యూనిస్టు భావజాలంలోని ఒక ముఖ్యమైన భాగం. అయితే, ఇక్కడ ఒక మినహాయింపు అవసరమని భావిస్తున్నాం. మతవిశ్వాసాలు కలిగినవారితో కలిసి పనిచేస్తూ, వారిని పార్టీ వైపు తీసుకురావడం అవసరం’’ అని ఆ పత్రంలో పేర్కొంది. మత విశ్వాసుల్లో, ముఖ్యంగా మహిళల్లో ఆర్‌ఎ్‌సఎ్‌స గట్టి పట్టు సాధించి, వారిని ఉపయోగించుకుని సమాజాన్ని కొత్త తరహా మతతత్వంతో నింపడంలో మంచి ఫలితాలను సాధించగలిగిందని ఆ పార్టీ విశ్లేషించింది. రాజకీయంగా పార్టీ విస్తరణ లక్ష్యాల కోసం ఆర్‌ఎ్‌సఎస్‌ మాదిరిగానే.. వారితో కలగలిసి పోవాలని ప్రతిపాదించింది.

Updated Date - Nov 08 , 2024 | 03:06 AM