LK Advani: రాముడే ప్రధాని మోదీని ఎంచుకున్నాడు.. నేను రథసారథిని మాత్రమే..
ABN , Publish Date - Jan 13 , 2024 | 07:54 AM
తన ఆలయాన్ని నిర్మింపజేయాలని ప్రధాని మోదీని(PM Modi) రాముడు భక్తుడి(Lord Rama)గా ఎంచుకుని పనులు పూర్తి చేయిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ(LK Advani) అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మోదీపై ప్రశంసలజల్లు కురిపించారు.
ఢిల్లీ: తన ఆలయాన్ని నిర్మింపజేయాలని ప్రధాని మోదీని(PM Modi) రాముడు భక్తుడి(Lord Rama)గా ఎంచుకుని పనులు పూర్తి చేయిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ(LK Advani) అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మోదీపై ప్రశంసలజల్లు కురిపించారు. "మోదీని రాముడే ఆలయ నిర్మాణ కర్తగా ఎంచుకున్నాడు. నేను రథసారథిని మాత్రమే. రథయాత్ర చేస్తున్న సమయంలో ఏదో ఒక రోజు రామ మందిర నిర్మాణం జరుగుతుందని భావించాను. ప్రస్తుతం అది సాక్షాత్కరిస్తోంది. అయోధ్యలో ఆలయ నిర్మాణం విధి నిర్ణయం.
అందుకే శ్రీ రాముడే మోదీని ఎంచుకున్నాడు. ఆయన భారత్ లోని ప్రతి పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పారు. అయోధ్య ఉద్యమం నా రాజకీయ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన సంఘటన. 1990లో రాముడిపై నమ్మకంతో ప్రారంభించిన రథయాత్ర ఒక ఉద్యమంలా మారుతుందని మేం ఊహించలేదు. నేను రథసారథిని మాత్రమే అని అనుకున్నాను. రథయాత్రలో మోదీ నా వెంటే ఉన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో మా వెంట దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి లేకపోవడం బాధ కలిగిస్తోంది.
యాత్రలో, నా జీవితాన్ని ప్రభావితం చేసిన అనేక సంఘటనలు జరిగాయి. మారుమూల గ్రామాల నుంచి ప్రజలు రథాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతూ నా దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసేవారు. రామ మందిర నిర్మాణానికి వారందరూ కలలు కనేవారు" అని అద్వానీ వ్యాఖ్యానించారు. అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాని యావత్తు భారతావని ఎదురుచూస్తోంది.
ఈ నెల 14 నుంచి 24 వరకు అయోధ్యలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం పోరాడిన వారిలో ఎల్ కే అద్వానీ కీలక భూమిక పోషించారు. ప్రారంభోత్సవానికి రానున్న ముఖ్య అతిథుల్లో అద్వానీ కూడా ఉన్నారు.