‘మహా’ కుంభమేళా!
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:44 AM
పరమ పవిత్ర గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ మేళాకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది.
ప్రపంచ స్థాయిలో నిర్వహణ.. 40 కోట్ల మంది వస్తారని అంచనా
లక్షా 60 వేలకుపైగా టెంట్లు.. లక్షా 50 వేల టాయిలెట్స్ నిర్మాణం
1,250 కిలో మీటర్ల పైపులైన్లు.. 4 వేల హెక్టార్లలో మేళా ఏర్పాట్లు
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
జనవరి 13 నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి రోజు తొలిస్నానం
మహాకుంభ్‌నగర్, డిసెంబరు 30: పరమ పవిత్ర గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ మేళాకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచస్థాయి మహా పర్వంగా ఈ కుంభమేళాను నిర్వహించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. గత రెండు మాసాలుగా రేయింబవళ్లు కార్మికులు ఇక్కడి పనుల్లో నిమగ్నమయ్యారు. దేశవ్యాప్తంగానే కాకుండా పలు ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లను కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. రహదారుల వెడల్పు నుంచి సంగమ ఘాట్ల సుందరీకరణ వరకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా మహా కుంభమేళా నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకం భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్‌కీ బాత్’లో మహాకుంభ మేళాను.. ‘ఐక్యతా మహాకుంభ్’గా అభివర్ణించిన విషయం తెలిసిందే. ‘‘ద్వేషం, విభజన వాదాలను పరిత్యజించాలనే ద్రుఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఐక్యతా మహాకుంభ్‌కు తరలి రావాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. ‘‘మహాకుంభ్ సందేశం.. యావత్ దేశాన్నీ ఐక్యంగా ఉంచడమే’’ అని తేల్చి చెప్పారు. కాగా, మహాకుంభ మేళాకు ప్రస్తుతం ఏర్పాట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జనవరి 10వ తేదీనాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో వడివడిగా పనులు చేస్తున్నట్టు మేళా అధికారి విజయ్‌కిరణ్ ఆనంద్ తెలిపారు. కాగా, ఆక్రమణలు, కోత కారణంగా సంగమం వద్ద గంగా నది 200 నుంచి 500 మీటర్ల వరకు తగ్గిపోయిందని చెప్పారు. ఇదిలావుంటే, 2024 ప్రారంభంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి చేసిన ఏర్పాట్లను మించి మహాకుంభ మేళాకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం. 2019లో కుంభమేళాకు చేసిన ఏర్పాట్ల కంటే రెట్టింపు ఏర్పాట్లను చేస్తున్నారు.
హరిత-ఆహ్లాద మేళా!
మహాకుంభమేళాను హరిత మేళాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటు చూసినా పచ్చని చెట్లు, నవ్వులు విరబూసినట్టుగా ఉండే పూల మొక్కలతో సంగమ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తంగా 3 లక్షల మొక్కలను ఇక్కడ నాటుతున్నారు. అదేవిధంగా 12 కిలో మీటర్ల మేర అతిపెద్ద ఘాట్‌ను నిర్మిస్తున్నారు. అదేవిధంగా మేళాకు వచ్చే భక్తుల మనసులు దోచుకునేలా సంగమ ప్రాంతంలోని లక్షా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రామాయణ, మహాభారతాల్లోని పలు అంశాలతో కూడిన కుడ్య చిత్రాలు, తైలవర్ణ చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు స్వాగతాలు పలికే చిత్రాలు కూడా మనసును దోచుకునేలా చిత్రీకరిస్తున్నారు.
భద్రత కట్టుదిట్టం
మహాకుంభమేళాకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. మొత్తంగా ఏడంచల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక పోలీసులు 13 తాత్కాలిక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం స్టేషన్ల సంఖ్య 57కు చేరింది. మహాకుంభమేళా జరిగే జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు సహా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద 23 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయుధ కానిస్టేబుళ్లు, 4 జాతీయ విపత్తు స్పందనా దళాలను, 21 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఒక్క రాష్ట్ర పోలీసులే 10 వేల మంది భద్రతా విధుల్లో ఉండనున్నారు.
ప్రపంచంలోనే పెద్దది
మతపరమైన కార్యక్రమాల్లో మహాకుంభమేళా ప్రపంచంలో అతి పెద్దదని అధికారులు చెబుతున్నారు. యూపీ ప్రభుత్వ అంచనాల మేరకు సుమారు 40 కోట్ల మంది భక్తులు పవిత్ర సంగమంలో స్నానం చేయనున్నారు. దీనికి తగిన విధంగానే ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
మహాకుంభమేళా పుష్య పౌర్ణమి తిథినాడు.. అంటే జనవరి 13న ప్రారంభం కానుంది. ఏకంగా 45 రోజుల పాటు కొనసాగిన తర్వాత మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి 26న ముగియనుంది. తొలి పవిత్ర స్నానాలు మకర సంక్రాంతినాడు ప్రారంభంకానున్నాయి. కాగా, మహాకుంభమేళాలో రాయ్‌బరేలీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులు, సిబ్బంది వైద్య సేవలు అందించనున్నారు.
అంకెల్లో ఏర్పాట్లు!
టెంట్లు: 1,60,000, టాయిలెట్లు: 1,50,000
పైపులైన్లు: 1,250 కి.మీ.
ఎల్‌ఈడీ లైట్లు: 67,000
సౌర దీపాలు: 2,000
దీప స్తంభాలు: 84, బస్టాండ్లు: 7
మేళా జరిగే విస్తీర్ణం: 4,000 హెక్టార్లు
శానిటేషన్ కార్మికులు: 15,000
నవీకరించిన రహదారులు: 90
తాగునీటి కనెక్షన్లు: 50,000
తాగు నీటి ఏటీఎంలు: 200
‘గంగా సేవ’ వలంటీర్లు: 150
పార్కింగ్ ప్రాంతాలు: 101
పార్కింగ్ ఏరియా: 1897 హెక్టార్లు