ఈడ వేసినం.. ఆడా ఓటేస్తం!
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:39 AM
ఈడ ఓటు వేసినం.. ఆడా ఎన్నికల్లోనూ ఓటేస్తం... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వివాదంలో ఉన్న 12 గ్రామాల్లోని ఓటర్ల ఉత్సాహమిది.
ఆసిఫాబాద్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఈడ ఓటు వేసినం.. ఆడా ఎన్నికల్లోనూ ఓటేస్తం... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వివాదంలో ఉన్న 12 గ్రామాల్లోని ఓటర్ల ఉత్సాహమిది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలోని 12 గ్రామాలు.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గం జీవతి తాలూకా పరిధిలో కూడా ఉన్నాయి. పరందోళి, అంతాపూర్, మహారాజ్‌గూడ, శంకర్‌లొద్ది, ముక్దంగూడ, లెండిగూడ, గౌరి, పద్మావతి, ఇసాపూర్, ఇందిరానగర్, బోలాపటార్ గ్రామాల ప్రజలకు ఇక్కడ తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉంది. ఈ 12 గ్రామాల్లోని ఓటర్ల కోసం మహారాష్ట్ర ఎన్నికల సంఘం పరందోళి, అంతాపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతాపూర్‌లో 1,612 మంది, పరందోళిలో 1,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.