Maldives: మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికీ లేదు.. చైనాలో మాల్దీవుల అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jan 13 , 2024 | 08:59 PM
ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న వివాదాస్పద వాతావరణం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న వివాదాస్పద వాతావరణం రోజుకో మలుపు తిరుగుతోంది (India-Maldives controversy). ప్రస్తుతం చైనా (China) పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu)భారత్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. ఐదు రోజుల చైనా పర్యటన నేటితో (శనివారం) ముగిసిన నేపథ్యంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మయిజ్జు పాల్గొన్నారు.
``మాల్దీవులు చాలా చిన్న దేశమే కావొచ్చు. అంతమాత్రాన మాల్దీవులను విమర్శించే హక్కు ఏ దేశానికీ లేదు`` అని మయిజ్జు కామెంట్స్ చేశారు. చైనాకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్న మయిజ్జు తాజాగా చేసిన కామెంట్స్ ఉద్రిక్తలను మరింత పెంచేవిగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల లక్ష ద్వీప్‌లో (Lakshadweep) పర్యటించి అక్కడి బీచ్‌లను, అక్కడ ఆయన సేద తీరుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలపై, ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
మాల్దీవుల మంత్రులు వ్యాఖ్యలపై తీవ్ర నిరసన పెల్లుబికింది. ``బాయ్‌కాట్ మాల్దీవ్స్`` (Boycott Maldives) నినాదం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మాల్దీవుల్లో 8 వేలకు పైగా హోటల్ బుకింగ్స్, వేల సంఖ్యలో విమాన టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో మాల్దీవుల ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను తొలగించింది. ఈ వివాదం సమయంలో చైనా పర్యటనకు వెళ్లిన మాల్దీవుల అధ్యక్షుడు తాజాగా భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారు. అలాగే చైనా నుంచి తమ దేశానికి మరింత మంది పర్యాటకులు రావాలని విజ్ఞప్తి చేశారు.