మణిపూర్ హింసపై తక్షణమే జోక్యం చేసుకోండి
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:11 AM
శాంతిభద్రతలు దిగజారిన మణిపూర్‌లో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తక్షణం జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం లేఖ రాశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మల్లికార్జున ఖర్గే లేఖ
న్యూఢిల్లీ, నవంబరు 19: శాంతిభద్రతలు దిగజారిన మణిపూర్‌లో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తక్షణం జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం లేఖ రాశారు. గత 18 నెలలుగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా దిగజారినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కదిద్దడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. మరోవైపు, మణిపూర్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేలు 27 మంది ఆ రాష్ట్రంలోని జిరిబమ్ జిల్లాలో మహిళలు, పిల్లల హత్యలకు కారకులైన కుకి మిలిటెంట్ల కోసం ప్రత్యేక ఆపరేషన్ జరపాలని తీర్మానించారు. మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఆ రాష్ట్ర సీఎం బీరేన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకొంటే తప్ప పరిస్థితులు చక్కబడవని తెలిపారు. కాగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ అమలుచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇంపాల్ పశ్చిమ జిల్లాలో పలు పౌర సంఘాలు మంగళవారం కర్ఫ్యూని ఉల్లంఘించి ర్యాలీని నిర్వహించాయి.