Shocking: విమానాశ్రయంలో రైస్, కోక్ తీసుకున్నాడు.. బిల్లు చూసి నివ్వెరపోయాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
ABN , Publish Date - Jan 02 , 2024 | 10:23 AM
ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో దొరికే ఆహార పదార్థాలు, స్నాక్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మహా అయితే 10 నుంచి 20 శాతం అధిక ధరకు విక్రయిస్తుంటారు. అయితే విమానాశ్రయంలో తీసుకునే ఆహార పదార్థాల ధరలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో దొరికే ఆహార పదార్థాలు, స్నాక్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మహా అయితే 10 నుంచి 20 శాతం అధిక ధరకు (Expensive) విక్రయిస్తుంటారు. అయితే విమానాశ్రయాల్లో (Airport) తీసుకునే ఆహార పదార్థాల ధరలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొంతకాలం క్రితం, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో ఒక దోసె ధర ఏకంగా రూ. 600 ఉన్న వీడియో సంచలనం సృష్టించింది.
తాజాగా ఓ విమానాశ్రయంలో ఓ కోక్ (Coke), రాజ్మా రైస్ (Rajma Rice) తీసుకునేందుకు ఏకంగా రూ.500 చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తిందని సంజయ్ అరోరా అనే వ్యక్తి ట్విటర్ ద్వారా ఆరోపించారు. ``విమానాశ్రయంలో మన నుంచి మోసపూరితంగా ఎందుకు ఎక్కువ డబ్బులు తీసుకుంటారో నాకు అర్థం కాదు. నేను కేవలం ఓ రాజ్మా రైస్, కోక్ తీసుకున్నందుకు రూ.500 బిల్ కట్టాను. ఇది పట్ట పగలు దోపిడీ కాదా? విమానంలో ప్రయాణిస్తున్న మాత్రాన వారిని దోచుకోవడం కరెక్టా`` అని సంజయ్ కామెంట్ చేశారు.
సంజయ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2 లక్షల మందికి పైగా ఈ ట్వీట్‌ను వీక్షించారు. తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. ``గత వారం కోల్‌కతా విమానాశ్రయంలో, నేను ఒక చిన్న కప్పు టీ కోసం రూ. 300/- చెల్లించాల్సి వచ్చింది``, ``ఎవరూ ప్రశ్నించలేని దోపిడీ``, ``భువనేశ్వర్ విమానాశ్రయంలో నేను ఒక కప్పు టీకి రూ. 180, సమోసాకు రూ. 100 చెల్లించాను``, ``విమానాశ్రయాలు సామాన్యుల కోసం కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.