Mani shankar Aiyar: మణిశంకర్ అయ్యర్ కుమార్తె 'రామ్‌మందిర్' పోస్ట్‌పై రగడ..
ABN , Publish Date - Jan 31 , 2024 | 07:01 PM
అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్ చేసిన పోస్ట్ వివాదం సృష్టిస్తోంది. రామమందిరం ప్రాణప్రతిష్ట సెర్మనీకి వ్యతిరేకంగా తాను నిరసనకు దిగనున్నట్టు జనవరి 20న ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో సురణ్య పేర్కొన్నారు. దీనిపై దక్షిణ ఢిల్లీ జాంగ్‌పుర రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) కుమార్తె సురణ్య అయ్యర్ (Suranya Aiyar) చేసిన పోస్ట్ వివాదం సృష్టిస్తోంది. రామమందిరం ప్రాణప్రతిష్ట సెర్మనీకి వ్యతిరేకంగా తాను నిరసనకు దిగనున్నట్టు జనవరి 20న ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో సురణ్య పేర్కొన్నారు. దీనిపై దక్షిణ ఢిల్లీ జాంగ్‌పుర రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్టింగ్‌ల విషయంలో సంయమనం పాటించాలని, లేదంటే వేరే కాలనీకి వెళ్లాలని సురణ్యకు రాసిన ఒక లేఖలో సూచించింది.
''శాంతిని కోరుకునే లొకాలిటీలో శరణ్య అయ్యర్ 3 రోజుల నిరాహార దీక్ష చేస్తామనడం, విద్యేష పూరిత ప్రసంగం చేయడం దురదృష్టకరం. ఈ లొకాలిటీలో చాలామంది సర్వం కోల్పోయి ఇక్కడకు వచ్చిన పాకిస్థానీయులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల మధ్య అపోహలు, విద్వేషాలకు తావిచ్చే చర్యలకు దిగకుండా మంచి సిటిజన్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాజకీయాల్లో మీరు మంచి అనుకున్నది చేయవచ్చు. కానీ, మీరు మాట్లాడే మాటల వల్ల కాలనీకి చెడ్డపేరు రాకూడదు. ముఖ్యంగా ఈ తరహా ప్రకటనలు, పోస్టులు చేసేటప్పుడు సంయమనం పాటించాలని మిమ్మల్ని కోరుతున్నాం'' అని అయ్యర్ కుమార్తెకు ఇచ్చిన నోటీసులో ఆర్‌డబ్ల్యూఏ విజ్ఞప్తి చేసింది.
సురణ్య అయ్యర్ చర్యను మణిశంకర్ అయ్యర్ ఖండించాలని, అలా చేస్తే తాము సంతోషిస్తామని ఆర్‌డబ్ల్యూఏ ఆ నోటీసులో పేర్కొంది. అయోధ్యలో ప్రాణప్రతిష్టకు నిరసన తెలుపుతామని చెప్పడం ఉత్తమాభిరుచి కాదని, ముఖ్యంగా సొసైటికీ, కాలనీకి ఏమాత్రం మంచిది కాదని తెలిపింది. ఆర్‌డబ్ల్యూఏ విజ్ఞప్తిని కానీ, కాలనీ ప్రజల మనోభావాలను కాదని నిరసన తెలపాలనుకంటే మాత్రం దయజేసి వేరే కాలనీకి మారాలని కూడా సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.