Share News

Vadodara: నాటి మోదీ స్థానంలో మన్‌కీబాత్‌ కుర్రాడు

ABN , Publish Date - May 03 , 2024 | 05:24 AM

అదృష్టం వరించడం అంటే ఇదేనేమో? ఏకంగా ప్రధాని మోదీ ఒకనాడు పోటీ చేసిన సీటు టికెట్‌ ఓ సాధారణ యువకుడికి దక్కితే.. అదికూడా ఆయనకు చెప్పకుండానే మంజూరు చేస్తే..

Vadodara: నాటి మోదీ స్థానంలో మన్‌కీబాత్‌ కుర్రాడు

  • 33 ఏళ్ల హేమంగ్‌ జోషిని వరించిన వడోదరా టికెట్‌

  • ఆయనకు చెప్పకుండానే ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

  • హోలీ పండుగ వేడుకల్లో ఉండగా సమాచారం

  • సిటింగ్‌ మహిళా ఎంపీని కాదని మరీ మంజూరు

వడోదర, మే 2: అదృష్టం వరించడం అంటే ఇదేనేమో? ఏకంగా ప్రధాని మోదీ ఒకనాడు పోటీ చేసిన సీటు టికెట్‌ ఓ సాధారణ యువకుడికి దక్కితే.. అదికూడా ఆయనకు చెప్పకుండానే మంజూరు చేస్తే.. సిటింగ్‌ ఎంపీని కాదని మరీ ఇస్తే..? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. గుజరాత్‌లోని వడోదరా స్థానంలో బీజేపీ ఈసారి ప్రయోగం చేసింది. ఈ స్థానంలో 33 ఏళ్ల హేమంగ్‌ జోషీ అనే కుర్రాడిని నిలిపింది.


ప్రస్తుతం పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల్లో హేమంగే చిన్నవారు. కాగా, బరోడాలోని ఎంఎస్‌ విశ్వవిద్యాలయంలో సోషల్‌ వర్క్‌ కోర్సు చేసిన హేమంగ్‌ సానెడో అనే జానపద నాటకాలు రాసేవారు. ఇవన్నీ స్వచ్ఛ భారత్‌ కేంద్రంగా ఉండేవి. గుజరాత్‌ అప్పటి సీఎం ఆనందీబెన్‌ పటేల్‌ చొరవ చూపి ఓ కార్యక్రమం అప్పగించారు. సానెడోకు ప్రాచుర్యం రావడంతో 2016లో మన్‌ కీ బాత్‌లో హేమంగ్‌ పేరును మోదీ ప్రస్తావించి, తర్వాత అభినందన లేఖ రాశారు.


ప్రస్తుతం ఐఐఎం అహ్మదాబాద్‌లో ‘లీడర్‌షి్‌ప’పై పీహెచ్‌డీ చేస్తున్న ఆయన.. హోలీ నాడు భార్యతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సమయంలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కారణం ఏమిటా? అని చూడగా వడోదర ఎంపీ టికెట్‌ కేటాయించినట్లు తెలిసింది. ఇక్కడ సిటింగ్‌ ఎంపీగా రంజన్‌భట్‌ ఉన్నారు. 2014లో మోదీ వడోదర సీటును వదిలి వారాణసీ ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత ఉప ఎన్నికతో పాటు 2019లోనూ రంజన్‌ నెగ్గారు. ఆమెపై వ్యతిరేకత రావడంతో హేమంగ్‌ను ఎంపిక చేశారు.

Updated Date - May 03 , 2024 | 05:24 AM