మన్మోహన్ ఓ చాంపియన్
ABN , Publish Date - Dec 28 , 2024 | 06:09 AM
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.
జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ, డిసెంబరు27: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచంలోని గొప్ప చాంపియన్లలో మన్మోహన్‌సింగ్ ఒకరని, భారత్-అమెరికాల మధ్య పౌర అణు సహకార ఒప్పందంలో కీలకపాత్ర పోషించారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ చెప్పారు. రెండు దేశాల మధ్య స్నేహం బలోపేతమయ్యేందుకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. మన్మోహన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో ఎప్పటికీ గుర్తుండిపోతారని బ్లింకెన్ కీర్తించారు. రష్యా-భారత్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక బంఽధం ఏర్పడటంలో మన్మోహన్ పాత్ర కీలకమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఆర్థిక రంగంలో భారత్ ప్రగతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. భారత్-చైనా మధ్య సంబంధాలు సజావుగా కొనసాగేలా మన్మోహన్ యత్నించారని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. మన్మోహన్ హయాంలో సరిహద్దు అంశంపై కీలక ఒప్పందాలు కుదిరాయన్నారు. దేశ ప్రయోజనాల కోసం ధైర్యంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టారని భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీర్తించారు. ఆర్థిక రంగంలో భారత్‌ను సరైన స్థానంలో ఉంచడంలో కీలకంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. అఫ్ఘానిస్థాన్ ప్రజలకు మన్మోహన్ మంచి మిత్రుడని ఆదేశ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ తెలిపారు. మన్మోహన్‌తో పనిచేయడం గొప్పగా ఉండేదని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ చెప్పారు. బ్రిక్స్, ఐబీఎ్‌సఏ గ్రూపుల ఏర్పాటులో మన్మోహన్ కీలకంగా వ్యవహరించారని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసెల్వా చెప్పారు. మంచి స్నేహితుడిని కోల్పోయానన్నారు. మన్మోహన్ గొప్ప దార్శనికుడని, అసామాన్య రాజనీతిజ్ఞుడని నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ చెప్పారు. అనేకతరాలపాటు ఆయన స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. మన్మోహన్ దార్శనిక ఆర్థికవేత్త అని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స చెప్పారు.
అవినీతికి మన్మోహన్ వ్యతిరేకం
అవినీతికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యతిరేకమని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే చెప్పారు. 2010 ఆరంభంలో మన్మోహన్ పాలనకు వ్యతిరేకంగా తాను ఉద్యమించినప్పుడు లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలకు సంబంధించి తన డిమాండ్లపై చురుగ్గా నిర్ణయాలు తీసుకున్నారని హజారే కీర్తించారు. మన్మోహన్‌సింగ్ సేవలను భారత్ ఎప్పటికీ గుర్తించుకుంటుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలిపింది. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత పదవి చేపట్టారని కీర్తించింది.
నా స్నేహితుడా...సోదరుడా... ఇక సెలవు!!
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం
మన్మోహన్‌సింగ్ మృతిపై మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భావోద్వేగంతో స్పందించారు. ‘‘గుడ్‌బై.. మైమిత్రా... మైభాయ్, మన్మోహన్’’ అంటూ ‘‘ఎక్స్’’లో తమ ఇద్దరి అనుబంధాన్ని వివరించారు. 1990ల్లో తామిద్దరం ఆర్థిక మంత్రులుగా ఉన్నప్పుడు కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి తనను విషాదంలో ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గొప్ప వ్యక్తి, భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిని స్మరిస్తూ ఎన్నైనా వ్యాసాలు, పుస్తకాలు రాయవచ్చన్నారు. భారత్ ప్రపంచంలోనే గొప్ప ఆర్థికశక్తిగా ఎదిగేందుకు ప్రధానిగా ఆయన ఓ మంత్రసానిలా కీలకపాత్ర పోషించారని కొనియాడారు. అవినీతిపై ఇద్దరం అవిశ్రాంత పోరాటం చేశామన్నారు. ఓ కీలక కేసును బయటకు తీయడంలోనూ సహకరించుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. ‘‘ఎక్కువ మందికి ఓ విషయం తెలియదు. మలేషియన్లతో నేడీ విషయాన్ని పంచుకోవాలి. నన్ను జైల్లో వేసినప్పుడు మన్మోహన్ ఓ సాహసానికి పూనుకున్నారు. అది అప్పటి మలేషియా ప్రభుత్వానికి నచ్చేదీకాదు. రాజకీయంగానూ సరైన నిర్ణయం కాదు... అయినా మన్మోహన్ ఆ పని చేశారు. నా పిల్లల చదువులకు ఉపకార వేతనాలు ఇవ్వడానికి ముందుకు రావడం... మరీ ముఖ్యంగా మా అబ్బాయి ఇహ్‌సాన్‌కు.. నేను వాటిని తిరస్కరించినా... ఆ చర్య ఆయన ఉదార స్వభావానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం’’ అని ఇబ్రహీం ప్రశంసించారు.