UP: సామూహిక వివాహం పేరుతో ఘరానా మోసం.. విషయం తెలుసుకున్న అధికారుల షాక్
ABN , Publish Date - Feb 04 , 2024 | 12:34 PM
ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) బయట పడిన ఘరానా మోసం అధికారులను నివ్వెర పరిచింది. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కోసం ఆశపడి చేసిన ఈ మోసంలో నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. జనవరి 25న యూపీలోని బలియా జిల్లాలో మణియార్ కళాశాలలో సామూహిక వివాహం జరిగింది.
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) బయట పడిన ఘరానా మోసం అధికారులను నివ్వెర పరిచింది. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కోసం ఆశపడి చేసిన ఈ మోసంలో నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. జనవరి 25న యూపీలోని బలియా జిల్లాలో మణియార్ కళాశాలలో సామూహిక వివాహం జరిగింది. ఇందులో 568 జంటలు పెళ్లి చేసుకున్నాయి. అయితే అందులో చాలా మంది డూప్ పెళ్లిళ్లు కావడం గమనార్హం. వారంతా ప్రభుత్వ పథకం నుంచి లబ్ధి పొందేందుకు డూప్ పెళ్లిళ్లు చేసుకున్నారని అధికారుల విచారణలో తేలింది. యూపీలో రాష్ట్ర ప్రభుత్వం 'సీఎం సామూహిక వివాహ వేడుక' పథకాన్ని ప్రవేశ పెట్టింది.
పేదింటి యువతుల పెళ్లి కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. వివాహం చేసుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన యువతీయువకులకు ఈ పథకం కింద రూ.51,000 ఆర్థిక సాయం అందజేస్తోంది. అయితే ఆ పథకం ద్వారా లబ్ధి పొందాలనే దురాశతో కొందరు అవినీతికి పాల్పడ్డారు. అధికారులు, మధ్యవర్తులు చేతులు కలిపి వందల సంఖ్యలో ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపారు. ఈ కార్యక్రమానికి ఫేక్ వధూవరులను తీసుకువచ్చి తంతు కానిచ్చారు.
కొత్తగా పెళ్లైన జంటలూ ఇందులో ఉండటం గమనార్హం. పెళ్లిలో భాగంగా చాలా మంది ఎవరికి వారు మెడలో దండలు వేసుకున్నారు. డబ్బు ఆశ చూపి తనని పెళ్లి కొడుకుగా మార్చారని ఓ యువకుడు మీడియాతో తెలిపాడు. అందుకు వారికి రూ.2 వేలు ఆఫర్ చేశారన్నారు. వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో కొందరు వధువుకు సింధూరం కూడా పెట్టలేదు. వీడియోను గమనించిన అధికారులు జరిగిన మోసాన్ని గుర్తించారు.
కదిలిన అధికారులు..
ఫేక్ పెళ్లిళ్ల విషయం తెలుసుకున్న అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. మనియార్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో జరిగిన సామూహిక వివాహాల వేడుకలో పాల్గొన్న లబ్ధిదారులెవ్వరికీ ప్రభుత్వం ఇంకా నగదు విడుదల చేయలేదని కలెక్టర్ రవీంద్ర కుమార్ తెలిపారు. కొందరు తమకు పెళ్లి జరిగిన విషయాలను దాచిపెట్టి పథకానికి దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు.
స్పందించిన ఎమ్మెల్యే..
కమ్యూనిటీ వివాహానికి బీజేపీ ఎమ్మెల్యే కేత్కీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ఈ ఘటనపై మాట్లాడుతూ... "కార్యక్రమానికి కేవలం రెండు రోజుల ముందు వారు నాకు సమాచారం అందించారు. నాకప్పుడే ఏదో తేడా కొట్టింది. ఇప్పుడు అసలు నిజం బయటకి వచ్చింది. దీనిపై విచారణ జరుగుతోంది" అని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి