మోదీది నైతిక ఓటమి!
ABN , Publish Date - Jun 30 , 2024 | 01:15 AM
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గమనిస్తే ప్రధాని మోదీ నైతికంగా పరాజయం పాలైన సంకేతాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు.
ప్రజా తీర్పు ప్రధానికి వ్యతిరేక సంకేతం : సోనియా నేర చట్టాలు నిలిపివేయాలని డిమాండ్
న్యూఢిల్లీ, జూన్ 29: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గమనిస్తే ప్రధాని మోదీ నైతికంగా పరాజయం పాలైన సంకేతాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. కానీ, దేశంలో ఎలాంటి మార్పూ రానట్టే, మార్పులేదన్నట్టే మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రజాతీర్పు సుస్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా కూడా.. తీర్పు మోదీకి వ్యతిరేకం’’ అని సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. ఓ పత్రికలో రాసిన వ్యాసంలో తాజా ఎన్నికల తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలనుకానీ, ప్రజా తీర్పును కానీ ఆయన అర్థం చేసుకున్నారనడానికి ఎలాంటి సాక్ష్యాలూ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఉప సభాపతి విషయంలో ఇది ప్రస్ఫుటంగా గోచరించిందని తెలిపారు. ‘‘లోక్‌సభ స్పీకర్ విషయంలో మోదీ దూతలు ఏకాభిప్రాయాన్ని కోరినప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. పార్లమెంటులో సమతుల్యతకు పెద్దపీట వేయాలని భావించింది.
ఇదే సమయంలో సంప్రదాయాలు పాటిస్తారని, సంప్రదాయం ప్రకారం ఉపసభాపతి పదవిని ప్రతిపక్షాలకు ఇస్తారని ఆశించాం. దీనినే బాధ్యతాయుతంగా అభ్యర్థించాం. కానీ, ప్రభుత్వం మాత్రం మా అభ్యర్థనను ససేమిరా అంగీకరించలేదు. సంప్రదాయాలకు గొడుగు పట్టలేదు’’ అని సోనియాగాంధీ విమర్శించారు. రాజ్యాంగంపై దాడిని దృష్టి మరల్చేక్రమంలోనే ప్రధాని, లోక్‌సభ స్పీకర్ నుంచి బీజేపీ నేతల వరకు ఎమర్జెన్సీని ప్రస్తావిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే.. 1975నాటి ఎమర్జెన్సీపై 1977లో ప్రజలు తీర్పు ఇచ్చారని, దీనిని నిర్ద్వంద్వంగా, నిస్పందేహంగా అప్పటి నేతలు ఆమోదించారని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన నేర న్యాయ చట్టాలపైనా సోనియాగాంధీ స్పందించారు. ఆ మూడు చట్టాలు పార్లమెంటు సంపూర్ణంగా పరిశీలించే వరకు వాటి అమలును నిలిపివేయాలని(సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి) ఆమె డిమాండ్ చేశారు.