MODI : మోదీ హ్యాట్రిక్ ఖాయం! .. ‘ఇండియా టుడే’ సంచలన సర్వే
ABN , Publish Date - Feb 09 , 2024 | 03:21 AM
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ మరోసారి విజయ కేతనాన్ని ఎగరవేయనుందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియాటుడే ఛానల్ నిర్వహించిన సర్వే వెల్లడించింది.
బీజేపీకి 304 సీట్లు.. ఎన్డీఏకు 335
ఇండియాకు 166.. కాంగ్రెస్-71
ఇండియాటుడే సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ మరోసారి విజయ కేతనాన్ని ఎగరవేయనుందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియాటుడే ఛానల్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. బీజేపీ 304 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని, బీజేపీ భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొంటే ఎన్డీఏ కూటమి బలం 335 స్థానాలకు చేరుకోనుందని ఈ సర్వే తెలిపింది. ప్రతిపక్ష ఇండియా కూటమి 166 సీట్లకే పరిమితమవుతుందని, కాంగ్రెస్ 71 సీట్లను గెల్చుకుంటుందని పేర్కొంది. సర్వేలో భాగంగా గత ఏడాది డిసెంబరు 15-జనవరి 28 మధ్య దేశంలోని 543 నియోజకవర్గాల్లో 35,801 మంది వ్యక్తులను ఇండియాటుడే సర్వే చేసింది. ఈ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యధికంగా 80 స్థానాలున్న యూపీలో మరోసారి బీజేపీ ప్రభంజనం సృష్టించనుంది. ఆ పార్టీ సొంతంగా 70 సీట్లను, మిత్రపక్షం ఆప్నాదళ్(ఎస్) 2 సీట్లను గెల్చుకోనున్నాయి. 2019లో ఈ రెండు పార్టీలకు కలిపి 64 సీట్లు (బీజేపీ 62) రాగా ఇప్పుడు అవి పెరగనున్నాయి. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన సమాజ్‌వాదీపార్టీ గత ఎన్నికల్లో గెల్చుకున్న 15 స్థానాల్లో 8 కోల్పోయి, ఈసారి ఏడు స్థానాలకు పరిమితం కానుంది. కాంగ్రెస్ ఒక్క సీటునే గెల్చుకోనుంది. యూపీ తర్వాత అత్యధిక సీట్లున్న మహారాష్ట్ర(48)లో శివసేన, ఎన్సీపీలు అంతర్గతపోరుతో చీలిపోయిన విషయం తెలిసిందే. శివసేనలో ఉద్ధవ్‌వర్గం, ఎన్సీపీలో శరద్‌పవార్ వర్గం ఇండియా కూటమిలో ఉండగా, సీఎం ఏక్‌నాథ్‌షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఎన్డీఏలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు(26) ఇండియా కూటమి గెల్చుకోనుంది. కూటమిలోని కాంగ్రెస్ 12 సీట్లు, ఎన్సీపీ-పవార్, శివసేన-ఉద్ధవ్ కలిసి 14 సీట్లు గెల్చుకోనున్నాయి. ఇక 42 సీట్లతో మూడో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పట్టు 22 సీట్లను గెల్చుకోనుంది. బీజేపీకి 19 సీట్లు, కాంగ్రె్‌సకు ఒక్క సీటు లభించవచ్చు. వామపక్షాలకు ఒక్క సీటూ రాదట. 40 సీట్లున్న బిహార్‌లో ఎన్డీఏ 32, ఇండియా 8 సీట్లను గెల్చుకోవచ్చు. అయితే, ఈ సర్వే జరిగిన సమయానికి ఇండియా కూటమిలో ఉన్న నితీశ్ ఇటీవల ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఏకు లభించే సీట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. 39 సీట్లున్న తమిళనాడులో అన్ని సీట్లనూ డీఎంకే-కాంగ్రె్‌సలతో కూడిన ఇండియా కూటమి గెల్చుకోనుంది. గుజరాత్, రాజస్థాన్‌లను గత ఎన్నికల్లోల్లాగే ఈసారి కూడా బీజేపీ పూర్తిగా స్వీప్ చేయనుందని ఈ సర్వే వెల్లడించింది.