Share News

Uttar Pradesh : మనిషిని ‘మార్చిన’ రాక్షస ప్రేమ!

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:19 AM

సున్నితంగా ఉండాల్సిన ప్రేమ.. ప్రాణాంతకంగా మారుతోంది. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలతో పని లేకుండా ప్రేమను రుద్దే సంఘటనలు పెరిగిపోతున్నాయి

Uttar Pradesh : మనిషిని ‘మార్చిన’ రాక్షస ప్రేమ!

  • అనుమతి లేకుండానే లింగమార్పిడి

  • శస్త్రచికిత్స జరిపించిన ప్రియుడు

  • సహకరించిన వైద్యులు

  • తనకు తెలియకుండానే

  • అమ్మాయిగా మారిన అబ్బాయి

  • యూపీలో దారుణం.. మానవ అవయవ

  • విక్రయ ముఠా కారణమన్న ఆరోపణలు

ముజఫర్‌పూర్‌, జూన్‌ 20: సున్నితంగా ఉండాల్సిన ప్రేమ.. ప్రాణాంతకంగా మారుతోంది. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలతో పని లేకుండా ప్రేమను రుద్దే సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇదే తరహాలో యూపీలోని ముజఫర్‌పూర్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ యువకుడి మీద ప్రేమను పెంచుకున్న మరో యువకుడు.. సదరు యువకుడికి తెలియకుండానే లింగమార్పిడి శస్త్రచికిత్స జరిపించి అమ్మాయిగా మార్పించాడు. తన అనుమతి లేకుండా జరిగిన ఈ దారుణంపై బాధిత యువకుడు లబోదిబోమంటున్నాడు. యూపీలోని సంజక్‌ అనే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు ముజాహిద్‌తో ఓంప్రకాశ్‌ అనే యువకుడు సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో ముజాహిద్‌కు ఆరోగ్య సమస్య ఉందని నమ్మించి అతడిని చికిత్స కోసం మన్సూర్‌పూర్‌లోని బేగ్రాజ్‌పూర్‌ మెడికల్‌ కాలేజీకి ఈ నెల 20న తీసుకెళ్లాడు. వైద్యులు ముజాహిద్‌ను పరీక్షించి, చిన్న శస్త్రచికిత్స చేస్తామని చెప్పి అనస్థీషియా(మత్తుమందు) ఇచ్చారు. ముజాహిద్‌ మత్తులో ఉండగానే అతడికి లింగమార్పిడి ఆపరేషన్‌ చేసి పురుషాంగం, వృషణాలు తొలిగించారు.


స్పృహలోకి వచ్చిన తర్వాత ముజాహిద్‌ జరిగిన దారుణాన్ని గ్రహించాడు. ఓంప్రకాశ్‌ అతడి వద్దకు వచ్చి.. ‘నేనే ఇదంతా చేయించా. ఇకపై నిన్ను నీ కుటుంబంగానీ, మీ వర్గం వాళ్లుగానీ దగ్గరికి రానివ్వరు. నాతో కలిసి ఉండాల్సిందే. నీ తండ్రిని తుపాకితో కాల్చి చంపుతా. నీ వాటా భూమి తీసుకొని దాన్ని నా పేరు మీద రాయాలి. అది అమ్మి లక్నోకు వెళ్లిపోదాం’ అని బెదిరించాడు. దీనిపై ముజాహిద్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఓంప్రకాశ్‌ను పోలీసులు అరె స్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఈ ఘట న వెనుక మానవ అవయవాలను విక్రయించే నేరముఠా ఉందని స్థానిక రైతు నేత శ్యాంలాల్‌ ఆరోపించారు. మనుషుల నుంచి అవయవాలను తొలగించి వాటిని విక్రయించటం, అనుమతి లేకుండా లింగమార్పిడి శస్త్రచికిత్సలు జరపటం వంటి దారుణాలు బేగ్రాజ్‌పూర్‌ మెడికల్‌ కాలేజీలో గతంలోనూ జరిగాయన్నారు. ఈ అనైతిక వ్యాపారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేశారు. బాధితుడికి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 04:19 AM