Share News

Jagdeep Dhankhar-Jaya Bachchan: రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధనఖడ్-జయా బచ్చన్ మధ్య సభలో ఘర్షణ

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:29 PM

రాజ్యసభ చైర్‌పర్సన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ - సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య పార్లమెంట్‌లో శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది.

Jagdeep Dhankhar-Jaya Bachchan: రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధనఖడ్-జయా బచ్చన్ మధ్య సభలో ఘర్షణ

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్‌పర్సన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ - సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య పార్లమెంట్‌లో శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘మీ స్వరం ఆమోదయోగ్యంగా లేదు’’ అని జయాబచ్చన్ అనడం ఇరువురి మధ్య వాగ్వాదానికి దారితీసింది. "సార్ నా పేరు జయ అమితాబ్ బచ్చన్. నేనొక నటినని మీతో చెప్పాలనుకుంటున్నాను. బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్‌ను నేను అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి.. మీ స్వరం ఆమోదయోగ్యంగా లేదు. మనం సహచరులం. మీరు స్పీకర్ స్థానంలో కూర్చొని ఉండవచ్చు. ’’ అని అన్నారు.

జయా బచ్చన్ మైక్ కట్ చేసిన ధన్‌ఖడ్ ఆమెపై అసహనం వ్యక్తం చేసిన ధన్‌ఖడ్ చేతులతో సైగలు చేసి కూర్చోవాలని సూచించారు. ‘‘నాకు మీరు పాఠాలు చెప్పొద్దు!’’ అని అన్నారు. ‘‘ మీరు ఒక నటి. మీరు సెలబ్రిటీ అయితే కావొచ్చు. కానీ మర్యాదగా మెలగాలి’’ అని సమాధానం ఇచ్చారు.


ధన్‌ఖడ్ ఆగ్రహం..

‘‘ గౌరవనీయులైన సభ్యులు అందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు’’ అని సభలో పెద్ద ఎత్తున అరుపులు కేకల నేపథ్యంలో ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. ‘‘జయా బచ్చన్ గారు మీరు గొప్ప పేరు సంపాదించారు. కానీ నటులు దర్శకుడికి లోబడి ఉంటారని మీకు తెలుసు. స్పీకర్ స్థానంలో కూర్చొని నేను గమనించిన దన్ని మీరు చూడలేరు. ప్రతిరోజూ ఇదే పరిస్థితిని పునరావృతం చేయవద్దు. నాకు మీ పాఠాలు అక్కర్లేదు. నేను ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు. నా స్వరం గురించి మాట్లాడతారా?. మీకు ఇది సరికాదు’’ అని కోపంగా చెప్పారు.

ధన్‌ఖడ్ మాట్లాడిన తీరుకి నిరసనగా, ఎంపీ జయా బచ్చన్‌కు మద్దతుగా సోనియా గాంధీతో పాటు ఇరత ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలంతా బయటకు వెళ్లారు. రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.

Updated Date - Aug 09 , 2024 | 03:52 PM