Jammu Kashmir: మతసామరస్యాన్ని చాటారు.. ఆలయం కోసం ముస్లింల భూదానం
ABN , Publish Date - May 11 , 2024 | 09:07 AM
లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) సమీపిస్తుండగా రాజకీయ నాయకులు మతాలను వాడుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్న వేళ.. మతసామరస్యం వెల్లివిరిసింది.
కశ్మీర్: లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) సమీపిస్తుండగా రాజకీయ నాయకులు మతాలను వాడుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్న వేళ.. మతసామరస్యం వెల్లివిరిసింది. ఆలయం కోసం ముస్లింలు తమ భూమిని దానం చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని ఇద్దరు ముస్లింలు 500 ఏళ్ల పురాతన హిందూ దేవాలయం కోసం తమ భూమిని విరాళంగా ఇచ్చారు.
ఖేరల్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు తమ స్థలాన్ని పంచాయితీకి విరాళంగా ఇచ్చారు. సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో కాన్సీపట్టా గ్రామంలో గౌరీ శంకర్ ఆలయం కోసం 1200 మీటర్ల రహదారిని 10 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు.
పంచాయతీ నిధులతో త్వరలో రోడ్డు నిర్మిస్తామని అధికారులు తెలిపారు. మాజీ పంచాయతీ సభ్యుడు, రైతు గులాం రసూల్ మాట్లాడుతూ.. రోడ్డు సమస్యను సాకుగా చూపి సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆలయానికి రహదారి లేకపోవడంతో మత విద్వేషాలు రగిల్చడానికి ప్రయత్నించారని అన్నారు.
రోడ్డుకు స్థల సేకరణ కోసం ఇటీవల పంచాయతీ సభ్యులు, రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూ యజమానులు రసూల్, మహ్మద్ తమ భూమిలో కొంత భాగాన్ని రోడ్డు కోసం ఇచ్చేందుకు అంగీకరించారు. మరోవైపు ఆలయం కూడా పునరుద్ధరణకు సిద్ధమైంది. ఈ ప్రాంతంలో ఆలయానికి మరికొంత భూమి ఉంది.
For Latest News and National News click here