Narayana Murthy: భారత్‌కి పెను సవాల్‌గా జనాభా పెరుగుదల: ఇన్ఫి నారాయణ మూర్తి
ABN , Publish Date - Aug 19 , 2024 | 10:39 AM
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు శ్రద్ధ చూపలేదని, పెరుగుతున్న జనాభా దేశానికి పెను సవాలు విసురుతోందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి(Narayana Murthy) ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాగ్‌రాజ్: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు శ్రద్ధ చూపలేదని, పెరుగుతున్న జనాభా దేశానికి పెను సవాలు విసురుతోందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి(Narayana Murthy) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జనాభా పెరుగుదల ప్రభుత్వాలకు సవాలు విసురుతోందని అన్నారు. "ఎమర్జెన్సీ్ విధించినప్పటి నుంచి భారత దేశ ప్రజలు జనాభా నియంత్రణపై తగినంత శ్రద్ధ చూపలేదు. ఇది మన దేశానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. జనాభా నియంత్రణలో అమెరికా, బ్రెజిల్, చైనా మనకంటే ముందుస్థానంలో ఉన్నాయి" అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
ఉన్నత ఆకాంక్షలు కలిగి ఉండాలి..
విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. దేశ పురోగతికి దోహదపడడమే నిజమైన వృత్తి నిపుణుడి బాధ్యత అని మూర్తి నొక్కి చెప్పారు. ఉన్నత ఆకాంక్షలను కలిగి ఉండటం, పెద్ద కలలు కనడం, ఆ కలలను నెరవేర్చుకోవడానికి కృషి ముఖ్యమని అన్నారు. ఒక తరం జీవితాలు బాగుపడాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి.. నా ప్రగతి కోసం తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఉపాధ్యాయులు అనేక త్యాగాలు చేశారని.. వారి త్యాగాలు వమ్ముకాలేదని అన్నారు.
ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. స్నాతకోత్సవంలో 1,670 డిగ్రీలు ప్రదానం చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 34 బంగారు పతకాలు పొందగా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 13 కాంస్య పతకాలు అందుకున్నారు.
For Latest News and National News click here