Share News

National : నకిలీ కంపెనీలు.. బలవంతపు చాకిరీ!

ABN , Publish Date - Jul 10 , 2024 | 04:32 AM

నకిలీ కంపెనీలు సృష్టించి, ఉద్యోగులతో బలవంతంగా పనిచేయిస్తున్నారనే ఆరోపణలపై ఓ మహిళ సహా నలుగురు తెలుగు వారిని అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు.

National : నకిలీ కంపెనీలు..  బలవంతపు చాకిరీ!

  • అమెరికాలో నలుగురు తెలుగువారి అరెస్టు.. వారిలో ఒకరు మహిళ

  • 100 మందికిపైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ

హ్యూస్టన్‌, జూలై 9: నకిలీ కంపెనీలు సృష్టించి, ఉద్యోగులతో బలవంతంగా పనిచేయిస్తున్నారనే ఆరోపణలపై ఓ మహిళ సహా నలుగురు తెలుగు వారిని అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. టెక్సా్‌సలో వేర్వేరు చోట్ల దాదాపు వంద మందికిపైగా యువతీ యువకులను నియమించినట్లు గుర్తించారు. ప్రిన్స్‌టన్‌లోని కొలీన్‌ కౌంటీ ప్రాంతం గిన్స్‌బర్డ్‌ లేన్‌లోని ఓ ఇంట్లో పెద్దసంఖ్యలో యువతులు నివసిస్తున్నారని, అక్కడేవో అనుమానాస్పద కార్యకలాపాలు సాగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

దీంతో సంతోష్‌ కట్కూరి(31)కి చెందిన ఆ ఇంటిని గత మార్చి 13న పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు చెందిన పలు ప్రోగ్రామింగ్‌ షెల్‌ కంపెనీల్లో 15మంది యువతులతో సంతోష్‌ భార్య ద్వారకా గుండా(31) పనిచేయిస్తున్నట్లు గుర్తించారు. మానవ అక్రమ రవాణాకు కేంద్రంగా భావిస్తున్న ఆ ఇంట్లో ఎలాంటి సామగ్రి లేదని, కేవలం కంప్యూటర్లు, దుప్పట్లు మాత్రమే ఉన్నాయని, యువతులంతా అక్కడి గదుల్లో నేలపైనే నిద్రిస్తున్నారని అధికారులు వెల్లడించారు. విచారణలో ప్రిన్స్‌టన్‌, మెలిస్సా, మెక్‌ కిన్నే ప్రాంతాల్లోనూ షెల్‌ కంపెనీలు నెలకొల్పి 100 మందికిపైగా ఉద్యోగులతో ఇదేవిధంగా చాకిరీ చేయిస్తున్నట్లు నిర్ధారించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న నేరారోపణలపై సంతోష్‌, ద్వారకతో పాటు వారికి సహకరించిన చందన్‌ దేశిరెడ్డి(24), అనిల్‌ మాలె (37)ను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Jul 10 , 2024 | 04:32 AM