Criminal Laws: కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చేది అప్పుడే..
ABN , Publish Date - Feb 24 , 2024 | 03:58 PM
వలసపాలకుల నాటి క్రిమినల్ చట్టాలను(New Criminal Laws) తొలగించి వాటి స్థానంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ సర్కార్ వాటి అమలు వివరాలను శనివారం ప్రకటించింది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఢిల్లీ: వలసపాలకుల నాటి క్రిమినల్ చట్టాలను(New Criminal Laws) తొలగించి వాటి స్థానంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ సర్కార్ వాటి అమలు వివరాలను శనివారం ప్రకటించింది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023లు 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) కోడ్ -1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872 స్థానాలను భర్తీ చేయనున్నాయి.
వీటికి 2023లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తర్వాత చట్టాలుగా మారాయి. జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం వంటి నేరాలకు కఠిన శిక్షలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏడేళ్లు, అంతకు పైబడి శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సిక్ తప్పనిసరని ఈ చట్టాలు చెబుతున్నారు.
భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలు చేర్చగా, IPCలో ఉన్న 19 నిబంధనలను తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనలలో జరిమానా పెంచగా.. 23 నేరాలలో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. ఆరు నేరాల్లో సమాజసేవను శిక్షగా మార్చారు. కొత్త చట్టాలు భారతీయత, భారత రాజ్యాంగం, ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో చెప్పారు. మూడు చట్టాల పరిధిలోని అన్ని వ్యవస్థలు అమల్లోకి వస్తే ఐదేళ్లలో భారత నేర న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి