Akhilesh Yadav: 'ఇండియా' కూటిమిలోనే నితీష్ ఉంటే పీఎం ఛాన్స్..
ABN , Publish Date - Jan 26 , 2024 | 09:13 PM
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విభిన్నంగా స్పందించారు. 'ఇండియా' కూటమిలోనే నితీష్ ఉంటే ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థి కావొచ్చని వ్యాఖ్యానించారు.
లక్నో: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) విభిన్నంగా స్పందించారు. 'ఇండియా' (I.N.D.I.A.) కూటమిలోనే నితీష్ ఉంటే ఆయన ప్రధాన మంత్రి (PM) అభ్యర్థి కావొచ్చని వ్యాఖ్యానించారు.
''కూటమి (I.N.D.I.A.)లో ఎవరి పేరైనా సరే ప్రధాన మంత్రి అభ్యర్థిగా పరిశీలించే అవకాశం ఉంటుంది. సరైన సపోర్ట్ ఉంటే ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా చూడొచ్చు'' అని అఖిలేష్ యాదవ్ అన్నారు. నితీష్ కుమార్ ఎన్డీయేలోకి వెళ్లకుండా ఇండియా కూటమిని పటిష్ట పరుస్తారని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు.
'ఇండియా' కూటమి ఏర్పాటులో నితీష్ కుమార్ కీలక భూమిక పోషించారు. 2023 జూన్ 23న పాట్నాలో జరిగిన కూటమి తొలి సమావేశానికి ఆయన ఆతిథ్యం కూడా ఇచ్చారు. ఇటీవల ఇండియా కూటమి వర్చువల్ మీటింగ్‌లో కూటమి కన్వీనర్ పదవికి నితీష్ పేరు ప్రతిపాదించినప్పటికీ ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోటీకి 28 విపక్ష పార్టీలతో 'ఇండియా కూటమి' ఏర్పడింది.