Share News

జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ ప్రమాణం

ABN , Publish Date - Oct 17 , 2024 | 06:49 AM

జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వం కొలువుతీరింది. శ్రీనగర్‌లోని షెరి ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కొత్త సీఎంగా ఒమర్‌ అబ్దుల్లాతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా జమ్మూకు చెందిన

జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ ప్రమాణం

ప్రభుత్వంలో చేరని కాంగ్రెస్‌.. బయటనుంచి మద్దతు.. ప్రమాణోత్సవానికి రాహుల్‌ హాజరు

అఖిలేశ్‌, కారత్‌, రాజా, కనిమొళి, సుప్రియా సులే కూడా

శ్రీనగర్‌, అక్టోబర్‌ 16: జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వం కొలువుతీరింది. శ్రీనగర్‌లోని షెరి ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కొత్త సీఎంగా ఒమర్‌ అబ్దుల్లాతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా జమ్మూకు చెందిన సురిందర్‌ చౌధరి, మరో నలుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక తదితరులు హాజరయ్యారు. ఇండియా బ్లాక్‌ తరపున సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌, సీపీఎం నేత ప్రకాశ్‌ కారత్‌, సీపీఐ నేత డి.రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళి, ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గం తరపున సుప్రియా సులే, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తదితరులు హాజరయ్యారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ కేబినెట్‌లో చేరలేదు. కాంగ్రెస్‌ మూడు మంత్రిపదవులు ఆశించగా ఒకటి మాత్రమే ఇస్తామని ఒమర్‌ స్పష్టం చేయడంతో ప్రభుత్వానికి వెలుపలినుంచి మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2019 ఆగస్ట్‌ 5న ఆర్టికల్‌ 370 రద్దు చేశాక ఇటీవల జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 42 స్థానాల్లో నెగ్గింది. ఎన్సీ కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ 6 చోట్ల గెలిచింది. ఐదుగురు ఇండిపెండెంట్‌ ఎమ్యెల్యేలు, ఒక ఆప్‌ ఎమ్మెల్యే, ఒక సీపీఎం ఎమ్మెల్యే ఒమర్‌ అబ్దుల్లా ప్రభుత్వానికి మద్దతిచ్చారు. దీంతో మొత్తం 55 మంది ఎమ్మెల్యేల బలం ప్రభుత్వానికి ఉంది. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో 90 నియోజకవర్గాలకు పోటీ జరగ్గా ఐదుగురిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 95 కానుంది.


సీఎం పదవి ముళ్ల కిరీటమే

జమ్మూకశ్మీర్‌ ఎదుట అనేక సవాళ్లున్న ప్రస్తుత తరుణంలో సీఎం పదవి ముళ్ల కిరీటమేనని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. సీఎంగా తన తనయుడు ఒమర్‌ అబ్దుల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు దేవుడు అండగా ఉంటాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫరూఖ్‌ అబ్దుల్లా తండ్రి షేక్‌ అబ్దుల్లా కూడా జమ్మూకశ్మీర్‌ సీఎంగా పనిచేశారు. అబ్దుల్లా కుటుంబం నుంచి మూడో తరం సీఎంగా ఒమర్‌ 2009-2014 మధ్య పనిచేశారు. కాగా, కొత్తగా కొలువుతీరిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వంలో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ ప్రమాణం చేశారు.

హరియాణా సీఎంగా నేడు సైనీ ప్రమాణం

హాజరుకానున్న మోదీ, చంద్రబాబు

చండీగఢ్‌, అక్టోబరు 16: హరియాణా సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీ గురువారం ప్రమాణం చేయనున్నారు. బుధవారం పంచ్‌కులలో జరిగిన సమావేశంలో సైనీని బీజేపీ శాసనసభాపక్షనేతగా నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. చండీగఢ్‌లో సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌, కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక పంచ్‌కులాలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే విస్తృత సమావేశం జరగనుంది. దీనికి పవన్‌ కల్యాణ్‌ హాజరు కానున్నారు. జమిలి ఎన్నికలు, జనగణన, ఉమ్మడి పౌర స్మృతి తదితర కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. బీజేపీకి, ఎన్డీయే పార్టీలకూ మధ్య సమన్వయానికి ఒక కమిటీ ఏర్పాటు చేయవచ్చని, ఇదే సమావేశంలో చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించవచ్చని చర్చ జరుగుతోంది.

Updated Date - Oct 17 , 2024 | 06:49 AM