Share News

‘100 రోజుల అజెండా’ పై ప్రధాని మోదీ చర్చ!?

ABN , Publish Date - Jun 03 , 2024 | 04:07 AM

ప్రధాని మోదీ ఆదివారం ఉన్నతాధికారులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారీ అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడడంతో కమలనాథుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

‘100 రోజుల  అజెండా’ పై  ప్రధాని మోదీ చర్చ!?

మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలక

నిర్ణయాలుంటాయని గతంలోనే చెప్పిన ప్రధాని!

తుపాను, వడగాడ్పులు సహా పలు అంశాలపై

ఉన్నతాధికారులతో సమీక్షించిన మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 2: ప్రధాని మోదీ ఆదివారం ఉన్నతాధికారులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారీ అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడడంతో కమలనాథుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌మెమోరియల్‌లో దాదాపు 45 గంటల పాటు ధ్యానం చేసిన ప్రధాని.. అది ముగిసిన తర్వాత ఢిల్లీ చేరుకున్నారు.

వివిధ అంశాలపై సమీక్షలతో ఆయన క్షణం తీరిక లేకుండా గడిపారు. ఫలితాలు రాకముందే.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేయాల్సిన ‘తొలి 100 రోజుల’ ప్రణాళికపైనా ప్రధాని మోదీ సమీక్షించినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికంటే ముందే మోదీ.. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, తొలి 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని తన మంత్రివర్గ సహచరులను కోరిన సంగతి తెలిసిందే.

కొన్ని కీలక, ప్రధాన నిర్ణయాలన్నీ తొలి 100 రోజుల్లోనే ఉంటాయని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెల్లడై, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100 రోజుల అజెండాపై సమీక్ష జరిపినట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసిన రీమల్‌ తుపాను, వరదలపై మోదీ ఉన్నతాధికారులతో సమీక్షించారు.


తుపాను, వరదల కారణంగా మిజోరం, అసోం, మణిపూర్‌, మేఘాలయ, త్రిపురల్లో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు మోదీకి వివరించారు. బాధిత రాష్ట్రాలకు కేంద్రం తరఫు నుంచి అన్ని విధాలుగా సాయం చేయాలని, అండగా నిలవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. తర్వాత ఆయన ఎండలు, వడగాడ్పుల వల్ల చోటుచేసుకుంటున్న మరణాలు, బాధిత కుటుంబాలకు సాయంపై సమీక్షించారు.

దేశవ్యాప్తంగా ఇటీవల పలు అగ్నిప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఆస్పత్రులు, ఇతర ప్రజా ప్రాంగణాల్లో అగ్నిమాపక, విద్యుత్తు భద్రతలపై క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ప్రధాని మోదీ అధికారులకు స్పష్టం చేశారు. ఈ అంశంలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటితోపాటు ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలపైనా ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. ఇలా ప్రధాని ఏడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

Updated Date - Jun 03 , 2024 | 04:09 AM