Padma Vibhushan : వెంకయ్య, చిరంజీవికి పద్మవిభూషణ్
ABN , Publish Date - Jan 26 , 2024 | 04:42 AM
రాజకీయాల్లో.. సినిమాల్లో.. ఇలా రెండు వేర్వేరు రంగాల్లో ఎలాంటి నేపథ్యమూ లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తమ స్వయంకృషితో, అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ఇద్దరు అసామాన్యులైన తెలుగు తేజాలను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది! వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి..
తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పద్మాలు
తెలంగాణ నుంచి కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విఠలాచార్య,
దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారికి పద్మశ్రీ
ఏపీకి చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా!
2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
పద్మవిభూషణ్‌కు ఎంపికైనవారిలో వైజయంతి మాల బాలి,
పద్మా సుబ్రహ్మణ్యం, ‘సులభ్’ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్
మిథున్ చక్రవర్తి, ఉషా ఉతప్, సీతారామ్ జిందాల్‌కు పద్మభూషణ్
తమిళ నటుడు విజయ్‌కాంత్‌కు మరణానంతరం ఆ పురస్కారం
ఐదుగురికి పద్మ విభూషణ్.. 17 మందికి పద్మభూషణ్.. 110 మందికి పద్మశ్రీ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాజకీయాల్లో.. సినిమాల్లో.. ఇలా రెండు వేర్వేరు రంగాల్లో ఎలాంటి నేపథ్యమూ లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తమ స్వయంకృషితో, అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ఇద్దరు అసామాన్యులైన తెలుగు తేజాలను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది! వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కాగా.. మరొకరు తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించింది. ఆ జాబితాలో పద్మభూషణ్ కేటగిరీలో తెలుగువారు ఎవరూ లేరు. ఇక, పద్మశ్రీ పురస్కారాలు.. తెలంగాణకు చెందిన ఐదుగురికి, ఏపీకి చెందిన ఒకరికి దక్కాయి. తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనవారిలో.. జనగాం ప్రాంతానికి చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట్ జిల్లా దామెరగిద్ద గ్రామానికి చెందిన ప్రముఖ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, తనకు మిగిలిన ఏకైక ఆస్తి అయిన ఇంటిని గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలను సమకూర్చిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, బంజారా జాతి జాగృతం కోసం పాటుపడుతున్న కేతావత్ సోమ్‌లాల్, యాదాద్రి సహా పలు ఆలయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ స్థపతి వేలు ఆనందాచారి ఉన్నారు. అలాగే.. ఏపీకి చెందిన ప్రముఖ హరికథా కళాకారిణి, దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన డి.ఉమామహేశ్వరికి కూడా కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
132 మందికి..
విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ.. ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 132 మంది ప్రముఖులకు ఈ పురస్కారాలను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 132 మందిలో ఐదుగురిని పద్మవిభూషణ్.. 17 మందినిపద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. బిహార్‌కు చెందిన శాంతిదేవి పాసవాన్, శివన్ పాసవాన్ ద్వయానికి కళల విభాగంలో ఒకటి.. కేరళకు చెందిన అశ్వతి తిరునల్ గౌరి, లక్ష్మీ బాయి తంపురట్టి ద్వయానికి సాహిత్యం, విద్య కేటగిరీలో ఒకటి చొప్పున పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. మొత్తమ్మీద ఈ జాబితాలో మొత్తం 30 మంది మహిళలు ఉండగా.. ఎనిమిది మంది విదేశీయులు/ప్రవాస భారతీయులు/భారత మూలాలున్న వ్యక్తులు/ఓవర్సీస్ సిటిజన్‌షి్‌ప ఆఫ్ ఇండియా (ఓసీఐ) కేటగిరీవారున్నారు. ఇటీవలే కన్నుమూసిన తమిళ నటుడు.. కెప్టెన్ విజయ్‌కాంత్ సహా తొమ్మిది మందికి మరణానంతర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.
పద్మభూషణ్ గ్రహీతలు..
పద్మవిభూషణ్ పురస్కారాలు లభించిన వారిలో వెంకయ్య నాయుడు, చిరంజీవితోపాటు.. తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి వైజయంతీ మాల బాలి, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రహ్మణ్యం, సులభ్ శౌచాలయ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (మరణానంతర పురస్కారం) ఉన్నారు. ఇక, పద్మభూషణ్ లభించిన వారిలో.. ప్రముఖ సినీ నటుడు మిథున్ చక్రవర్తి, ప్రముఖ గాయని ఉషా ఉతప్, తమిళ నటుడు విజయ్‌కాంత్ (మరణానంతరం), కేంద్ర మాజీ మంత్రి సత్యవ్రత ముఖర్జీ (మరణానంతరం), ప్రముఖ సంగీత దర్శకుడు ప్యారేలాల్, ప్రముఖ వ్యాపారవేత్త సీతారామ్ జిందాల్, మహారాష్ట్రకు చెందిన సీనియర్ జర్నలిస్టు హోమ్‌సజీ ఎన్ కామా, తైవాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఫాక్స్‌కాన్ గ్రూప్ చైర్మన్ యంగ్ లియూ, సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా నియమితురాలైన ఎం.ఫాతిమా బీవి (మరణానంతరం), ప్రముఖ గుండె వైద్య నిపుణులు అశ్విన్ బాలచంద్ మెహతా, తేజస్ మధుసూదన్ పటేల్, యూపీ మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, తేజస్ మధుసూదన్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి ఓలంచేరి రాజగోపాల్, దత్తాత్రేయ అంబాదాస్ మయాలు, తోగ్దాన్ రిన్‌పోచే (మరణానంతరం), కేంద్ర మాజీ మంత్రి చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, కుందన్ వ్యాస్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలు పొందినవారిలో ముగ్గురు (డి.ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప).. ‘అన్‌సంగ్ హీరోస్’ పేరిట విడుదల చేసిన 34 మంది జాబితాలో ఉన్నారు. అలాగే, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన తెలుగేతర ప్రముఖుల్లో.. రోహన్ బోపన్న, జోత్స్న చిన్నప్ప వంటివారు ఉన్నారు.