Share News

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. ఐఎస్ఐ భారీ కుట్ర!

ABN , Publish Date - Jul 27 , 2024 | 02:41 PM

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra)కు ఉగ్ర ముప్పు పొంచి ఉందా. అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పవిత్ర యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ (ISI) కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. ఐఎస్ఐ భారీ కుట్ర!

జమ్మూ: పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra)కు ఉగ్ర ముప్పు పొంచి ఉందా. అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పవిత్ర యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ (ISI) కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా సహకారంతో ఐఎస్‌ఐ ఈ కుట్రకు తెరతీసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

తీర్థయాత్ర సమయంలో సామాన్య పౌరులే టార్గెట్‌గా ఉగ్రదాడికి ప్లాన్ వేసినట్లు దర్యాప్తులో తేలింది. పంజాబ్, దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ నాయకులు, హిందువులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిచేందుకు ఐఎస్‌ఐ ప్రణాళిక రచించినట్లు సదరు వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్‌లు, రాడికల్‌ గ్రూపులు ఈ దాడి కోసం ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపినట్లు అధికారులు చెబుతున్నారు.


కశ్మీర్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు?

దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ నుంచి ఏడుగురు ఉగ్రవాదులు కశ్మీర్‌లోని ప్రవేశించారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే పఠాన్‌కోట్‌ సమీపంలోని ఓ గ్రామంలో అధునాతన ఆయుధాలతో అనుమానిత ఉగ్రవాదుల కదలికలను గుర్తించాయి. జమ్మూ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాకిస్థాన్ కుట్ర ఉన్నట్లు సైనికులు అనుమానిస్తున్నారు.


అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. ఉగ్ర కుట్రల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన భారత బలగాలు అమర్‌నాథ్ యాత్రకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో అమర్‌నాథ్‌ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.ఈ ఏడాది జూన్ 29న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 4 లక్షలకుపైగా భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 02:42 PM