Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన... సంచలన ఆరోపణలు చేసిన తల్లిదండ్రులు
ABN , Publish Date - Sep 09 , 2024 | 09:52 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ - హాస్పిటల్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైద్యురాలి తల్లిదండ్రులు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ - హాస్పిటల్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైద్యురాలి తల్లిదండ్రులు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో వైద్యురాలి తల్లి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ కేసు మొదలైన నాటి నుంచి ప్రభుత్వం, పరిపాలన యంత్రాంగం, పోలీసులు మాకు సహకరించలేదు. మొదటి నుంచి సాక్ష్యాలను నాశనం చేయడానికి కూడా ప్రయత్నించారు. మాకు న్యాయం జరగనంత వరకు సామూహిక నిరసన కొనసాగించాలని నేను కోరుతున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు.
సామూహిక నిరసనలు తనకు న్యాయం జరుగుతుందనే ఆశను కలిగిస్తున్నాయని హత్యకు గురైన వైద్యురాలి తండ్రి వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిఒక్కరూ మాకు అండగా ఉండాలని నేను వేడుకుంటున్నాను. న్యాయం అంత తేలికగా రాదు అని నాకు తెలుసు. మనం న్యాయం జరిగేలా చూడండి. జనాలే మా బలం, ధైర్యాలకు మూలం. జనాలు మాతోనే ఉంటారని ఆశిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా ప్రథమ సమాచారాన్ని నమోదు చేయడంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని తండ్రి ఆరోపించారు. ఒక పోలీసు అధికారి తనకు డబ్బు ఆఫర్ చేశాడని, ఈ విషయాన్ని సెటిల్ చేసుకునేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు. ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించినప్పటికీ కోల్‌కతా పోలీసులకు చెందిన ఓ అధికారి ఉద్దేశపూర్వకంగా తప్పుడు మీడియా ప్రకటనలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇక అంతకుముందు రెండవ పోస్ట్‌మార్టం కోసం తన కుమార్తె మృతదేహాన్ని భద్రపరచాలని కోరారని, అయితే ఆమెను బలవంతంగా దహనం చేశారని ఆయన విచారం వ్యక్తం చేశారు. సుమారు 300-400 మంది పోలీసులు తమను చుట్టుముట్టారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితిని సృష్టించారని, ఈ పరిస్థితి చూసి ఆమెను దహనం చేయాల్సి వచ్చిందని వైద్యురాలి తండ్రి విచారం వ్యక్తం చేశారు. ఆదివారం కోల్‌కతా నగరంలో వైద్యులు తల్లిదండ్రులు భారీ నిరసనల ప్రదర్శన చేశారు. ఈ ఆందోళనలో వైద్యురాలి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.
కాగా ఈ కేసులో దర్యాప్తు రిపోర్టును సీబీఐ నేడు (సోమవారం) సుప్రీంకోర్టుకు అందజేయనుంది. అయితే ఈ కేసులో సీబీఐ ఏం తేల్చిందనేది అనేది ఆసక్తికరంగా మారింది.