ప్లీజ్ మమ్మల్ని కాపాడండి..
ABN , Publish Date - Jul 31 , 2024 | 05:54 AM
చిమ్మచీకట్లో కొండచరియలు విరిగిపడి.. నీరు, బురద కలిసి ప్రవాహమై విరుచుకుపడడంతో ఆ ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి! చాలామంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయి..
శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్‌కాల్స్
చిమ్మచీకట్లో కొండచరియలు విరిగిపడి.. నీరు, బురద కలిసి ప్రవాహమై విరుచుకుపడడంతో ఆ ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి! చాలామంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయి.. బయటకు వచ్చే మార్గం లేక.. తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలంటూ ప్రాధేయపడ్డారు. ఇలాంటి ఫోన్ సంభాషణలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి. చూరాల్మాలా ప్రాంతంలోని ఓ మహిళ తమ వారికి ఫోన్ చేసి ఇల్లు మొత్తం కూలిపోయిందని.. తాము శిథిలాల్లో ఉన్నామని.. తమను బయటకు తీయాలని, తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్న ఆడియో వైరల్ అవుతోంది. ఈ విషాద ఘటనలో గాయపడిన ఓ వృద్ధుడు తన భార్య ఆచూకీ గల్లంతైందని ఆందోళన వ్యక్తంచేశాడు. ‘‘మేం మా ఇంట్లో నిద్రిస్తుండగా.. తెల్లవారుజామున పెద్ద శబ్దం వినిపించింది. పెద్ద పెద్ద కొండరాళ్లు, చెట్లు విరిగి మా ఇంటి పైకప్పుపై పడ్డాయి. వరదనీరు మా ప్రాంగణంలోకి ప్రవేశించింది’’ అని ఆ వ్యక్తి వాపోయాడు.