Share News

PM Modi: కువైత్‌తో భారత్‌కు చారిత్రక సంబంధాలు

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:56 AM

గల్ఫ్‌ దేశం కువైత్‌తో భారతదేశానికి చారిత్రక సంబంధాలున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

PM Modi: కువైత్‌తో భారత్‌కు చారిత్రక సంబంధాలు

1961 వరకూ భారత కరెన్సీ చలామణి

వివిధ రంగాల్లో 10 లక్షల మంది భారతీయులు

కువైత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ

మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం

(సెంట్రల్‌ డెస్క్‌)

గల్ఫ్‌ దేశం కువైత్‌తో భారతదేశానికి చారిత్రక సంబంధాలున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఫైలకా ద్వీపంతో ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన వ్యాపార సంబంధాల గురించి చరిత్ర వివరిస్తోందని.. 1961 వరకు కూడా కువైత్‌లో భారత కరెన్సీ చట్టబద్ధంగా చలామణిలో ఉండేదని గుర్తుచేశారు. ఇది ఇరు దేశాల మధ్య సమైక్యతకు నిదర్శనం కాగా.. ఇప్పుడు కూడా కువైత్‌కు భారతదేశం సహజ వాణిజ్య భాగస్వామిగా ఉందన్నారు. ఇరుదేశాల మైత్రీబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంకేతికత మొదలు రక్షణ దాకా.. ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వివరించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం కువైత్‌ చేరుకున్న ప్రధాని మోదీ, ఆదివారం కువైత్‌ రాజు, యువరాజుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కువైత్‌ వార్తా సంస్థ(కునా)కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

భారతీయులే గొప్ప వనరులు

కువైత్‌తోపాటు.. గల్ఫ్‌ సహకార దేశాల్లోనూ అభివృద్ధిలో 90 లక్షల మంది భారతీయులు పాలుపంచుకుంటున్నారు. ఒక్క కువైత్‌లోనే 10 లక్షల మందితో అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ ఉంది. మౌలిక సదుపాయాల రంగంలో ప్రాజెక్టుల అమలులో వీరి పాత్ర కీలకం. కువైత్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ కూడా భారత్‌లో పెద్దఎత్తున (2023లో 10 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చలు జరిగాయి. భారత్‌ విజన్‌-2047 (అమృత్‌కాల్‌ మహోత్సవ్‌), న్యూ కువైత్‌-2035 దార్శనిక లక్ష్యాలను సాధించేందుకు ఇరుదేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి. భారతీయ వ్యాపారులు, ఇంజనీర్లు, నర్సులు.. ఇలా వివిధ రంగాల వారు కువైత్‌కు గొప్ప వనరులుగా ఉన్నారు. ఇప్పటికే భారత అవసరాల్లో 3ు ఇంధనాన్ని కువైత్‌ సరఫరా చేస్తోంది. ఈ రంగంలో గత ఏడాది 10 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు జరిపాం. మాకు చమురు దిగుమతి పరంగా కువైత్‌ ఆరో అతిపెద్ద దేశం. లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ సరఫరా విషయంలో నాలుగో అతిపెద్ద దేశం. సాంస్కృతికంగానూ ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో.. ముఖ్యంగా కువైత్‌లో భారతీయ సినిమాలకు విశేష ఆదరణ ఉంది. కువైత్‌ టీవీలో కూడా వారంలో మూడు షోలు భారతీయ సినిమాలు, నటులకు సంబంధించి ఉంటున్నాయని ఇక్కడి అధికారులు నాకు వివరించారు. ‘నమస్తే కువైత్‌’ పేరుతో కువైత్‌ నేషనల్‌ రేడియో హిందీ కార్యక్రమాలను ప్రసారం చేయడం, నా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరం. కొవిడ్‌ సమయంలోనూ గల్ఫ్‌ దేశాలకు భారత్‌ టీకా మైత్రితో సహకారం అందజేసింది. 100కు పైగా దేశాలకు భారత్‌ వ్యాక్సిన్లను, వైద్య సామగ్రిని అందజేసింది.


యుద్ధాల్లో శాంతిమంత్రం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ.. ఇజ్రాయెల్‌-హమాస్‌, హిజ్బుల్లా ఘర్షణల్లోనూ భారత్‌ శాంతిని కోరుకుంది. గాజాలో 70 టన్నులకు పైగా మానవతా సాయాన్ని పంపించాం. గత నెలలో 65 టన్నుల ఔషధాలను అందజేశాం. రెండేళ్లలో యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు 10 మిలియన్‌ డాలర్ల మేర విరాళాలిచ్చాం.

మోదీకి అత్యుత్తమ పురస్కారం

ప్రధాని మోదీని కువైత్‌ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌-కబీర్‌’తో సత్కరించింది. కువైత్‌ రాజు షేక్‌ మిశాల్‌ అల్‌-అహ్మద్‌ అల్‌-జాబేర్‌ అల్‌-సబా ఆదివారం మోదీకి ఈ అవార్డును అందజేశారు. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజ కుటుంబ సభ్యులకు కువైత్‌ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌ తదితరులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.


ప్రధాని సభలో టీడీపీ జెండా రెపరెపలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ప్రధాని కువైత్‌ పర్యటనలో భాగంగా శనివారం జరిగిన సభలో టీడీపీ కార్యకర్తలు తమ పార్టీ పతాకాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు. శేఖ్‌ సాద్‌ అబ్దుల్లా స్టేడియంపైభాగంలోని గ్యాలరీలో ఒక చేత్తో త్రివర్ణ పతకాన్ని, మరోచేత్తో పార్టీ పతాకాన్ని రెపరెపలాడించారు. గల్ఫ్‌ దేశాల్లో నిర్వహించే సభల్లో జెండాలు ప్రదర్శించడం, రాజకీయ నినాదాలు చేయడం నిషిద్ధం. కానీ టీడీపీ కార్యకర్తలు పసుపు జెండాను రహస్యంగా లోపలకి తీసుకెళ్లారు. గ్యాలరీ మొదటి వరుసలో టీడీపీ కువైత్‌ శాఖ ప్రముఖుడు కోడూరి వెంకట్‌ ఆశీనులయ్యారు. ఈ సభలో ఏపీకి చెందిన పార్టీ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కువైత్‌ పర్యటన సందర్భంగా మోదీ గల్ఫ్‌ స్పిక్‌ సంస్థకు చెందిన లేబర్‌ క్యాంపును సందర్శించి, అక్కడి కార్మికులతో ముచ్చటించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర ఐదేళ్ల క్రితం ఈ క్యాంపును సందర్శించి వెళ్లారు.

Updated Date - Dec 23 , 2024 | 03:56 AM