PM Modi: అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ దినచర్య ఇదే
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:26 PM
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని(Ayodhya Ram Mandir) పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అనుస్థాన్(ప్రత్యేక జపం) పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జనవరి 12 నుంచి కఠిక నేలపై నిద్ర పోతున్నారు. ఉదయం లేవగానే యోగా, వ్యాయామం, ధ్యానం చేస్తూ గడుపుతున్నారు.
ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ(Ayodhya Ram Mandir)కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అనుస్థాన్(ప్రత్యేక జపం) పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జనవరి 12 నుంచి కఠిన నియమాలను ఆచరిస్తున్నారు. అనుస్థాన్ నియమాలను అనుసరిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
"అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం శుభపరిణామం. ఆరోజు చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవబోతోంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నా సమక్షంలో జరగడం.. భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి భగవంతుడు నన్ను పుట్టించినట్లుగా భావిస్తున్నాను. అందుకే కఠినమైన అనుస్థాన్ నియమాలను అనుసరిస్తున్నాను. ఈ ఘట్టం నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. నా జీవితంలో తొలిసారి ఇలాంటి అనుభూతి పొందుతున్నాను. అయోధ్య ప్రాణ ప్రతిష్టాపనోత్సవం ప్రపంచమంతటికీ పవిత్రమైన సందర్భం" అని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రాణ ప్రతిష్ఠకు..
జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీతో పాటు దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరుకానున్నారు. ఆలయాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. ఆహ్వానం అందుకున్న వారిలో సామాన్యుల నుంచి దేశాధినేతలు ఉన్నారు.