7న కశ్మీర్‌కు ప్రధాని మోదీ
ABN , Publish Date - Feb 29 , 2024 | 04:14 AM
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇదే తొలిసారి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. శివరాత్రికి ఒక్క రోజు ముందు.. మార్చి 7న కశ్మీర్ పర్యటనకు వెళుతున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున శ్రీనగర్‌లో జరిగే సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అంతేకాక, పలు పథకాలను కూడా ప్రారంభించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ కశ్మీర్ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సరికొత్త కశ్మీర్(నయా కశ్మీర్) తాము సాధించిన గొప్ప విజయంగా బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకోనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో కశ్మీర్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. శ్రీనగర్‌లో సభా వేదిక కూడా నిర్ణయం కావడంతో పోలీసులు, పారామిలటరీ బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహన తనిఖీలు చేపడతున్నాయి. సభావేదిక పరిసరాలను జల్లెడ పడుతున్నాయి. కాగా, ఫిబ్రవరి 20న జమ్మూలో పర్యటించిన ప్రధాని మోదీ రూ.32వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించారు.
సచిన్ పర్యటనపై మోదీ స్పందన
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తన కుటుంబంతో కలిసి ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. ఇందుకు సంబంధించి సచిన్ బుధవారం ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘జమ్మూకశ్మీర్ పర్యటన ఓ అందమైన అనుభవంగా ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో ఉండిపోతుంది. మనం దేశంలో సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పిన మాటలను ఈ పర్యటన తర్వాత నేను ఏకీభవిస్తున్నా. ఇక్కడ తయారయ్యే కశ్మీర్ విల్లో బ్యాట్లు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఆఫ్ వరల్డ్‌కు మంచి ఉదాహరణ. జమ్మూకశ్మీర్ అందాలను ఆస్వాదించాలని ప్రజలకు నేను పిలుపునిస్తున్నా’’ అని అందులో పేర్కొన్నారు. ఈ వీడియోపై స్పందించిన మోదీ. కశ్మీర్‌లో సచిన్ పర్యటనను చూసిన యువత రెండు విషయాలు తెలుసుకోవాలన్నారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలను సందర్శించడం అందులో ఒకటైతే.. మేక్ ఇన్ ఇండియా ప్రాముఖ్యతను గుర్తించడం రెండోదని అన్నారు. అందరం కలిసి వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
నేడో రేపో బీజేపీ తొలిజాబితా!
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్ఠానం బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. పలు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు, వారి విజయావకాశాలపై మేధోమథనం నిర్వహించింది. గురువారం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై పలు రాష్ట్రాల్లో అభ్యర్థులను ఖరారు చేయనుంది. అనంతరం, బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించనుంది. తొలి జాబితాలో 100మంది పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి సీనియర్ నాయకుల పేర్లతో పాటు 2019లో ఓడిపోయిన పలు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని పేర్కొన్నాయి. 2019లో కూడా బీజేపీ తొలి జాబితాలోనే మోదీ, అమిత్ షా పేర్లను ప్రకటించింది. అయితే, అప్పుడు లోక్‌సభ షెడ్యూల్ వెలువడిన తర్వాత తొలి జాబితాను వెల్లడించింది.