Share News

PM Narendra Modi: బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

ABN , Publish Date - Aug 15 , 2024 | 11:34 AM

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇటీవలి నెలకొన్న రాజకీయ అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై మోదీ స్పందించారు.

PM Narendra Modi: బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
Narendra Modi

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇటీవలి నెలకొన్న రాజకీయ అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై మోదీ స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ఎల్లప్పుడూ బంగ్లాదేశ్ అభివృద్ధిని కాంక్షించే శ్రేయోభిలాషిగా ఉంటుందని, అక్కడి పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని భారతీయులు కోరుకుంటున్నారని మోదీ అన్నారు.


దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆగస్ట్ 5న బంగ్లాదేశ్‌లో నిరసనకారులు రాజధాని ఢాకా వీధుల్లోకి వచ్చి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. నిరసనకారుల డిమాండ్లకు తలొగ్గిన షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే రోజు ప్రత్యేక హెలికాప్టర్‌లో పారిపోయి భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం ఆమె ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ హింసలో బంగ్లాదేశ్‌లోని హిందూ, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగాయి. అత్యధికంగా హిందువులపైనే ఎక్కువ దాడులు జరిగాయి. దీంతో అక్కడి హిందువుల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


52 జిల్లాల్లో మతపరమైన దాడులు..

బంగ్లాదేశ్ జనాభాలో మైనారిటీ వర్గాలు 8 శాతం మంది ఉన్నారు. ఈ వర్గాలు సాంప్రదాయకంగా షేక్ హసీనా సారధ్యంలోని అవామీ లీగ్ పార్టీకి మద్దతు ఇస్తుంటారు. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ లెక్కల ప్రకారం.. ఆగస్టు 5 తర్వాత దేశంలో మొత్తం 64 జిల్లాలు ఉండగా కనీసం 52 జిల్లాల్లో మత హింసకు సంబంధించిన ఘటనలు జరిగినట్టు స్పష్టం చేసింది.


11వ సారి జాతీయ పతాకావిష్కరణ

ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.

Updated Date - Aug 15 , 2024 | 11:45 AM