Share News

Trading Scam: అధిక లాభాల పేరుతో ఘరానా మోసం.. అసోంలో 2 వేల 200 కోట్ల కుంభకోణం

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:18 PM

అసోంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు యువకులు కలిసి చేసిన రూ.2 వేల 200కోట్ల ఘరానా మోసం గుట్టు రట్టు చేశారు అసోం పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిబ్రూఘర్‌కు చెందిన విశాల్(22), గువహాటికి చెందిన స్వప్నిల్ దాస్ ఇరువురు స్నేహితులు.

Trading Scam: అధిక లాభాల పేరుతో ఘరానా మోసం.. అసోంలో 2 వేల 200 కోట్ల కుంభకోణం

గువాహాటి: అసోంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు యువకులు కలిసి చేసిన రూ.2 వేల 200కోట్ల ఘరానా మోసం గుట్టు రట్టు చేశారు అసోం పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిబ్రూఘర్‌కు చెందిన విశాల్(22), గువహాటికి చెందిన స్వప్నిల్ దాస్ ఇరువురు స్నేహితులు. ఇద్దరు జల్సాలకు అలవాటుపడి ఈజీగా డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కారు.

ట్రేడింగ్ స్కాం చేయాలని నిర్ణయించుకున్నారు. 60 రోజుల్లోగా తమ పెట్టుబడులపై 30 శాతం రాబడికి హామీ ఇస్తూ పెట్టుబడిదారులను ప్రలోభపెట్టారు. అలా అసోం, అరుణాచల్ ప్రదేశ్లో ప్రజల నుంచి రూ.2 వేల 200 కోట్లు కాజేశారు. బాధితులంతా తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దర్యాప్తులో సంచలన విషయాలు..

పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహితులిద్దరూ కలిసి ఏకంగా రూ.2 వేల కోట్లకుపైగా కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు వారిని పట్టుకోవడానికి బృందాలను ఏర్పాటు చేశారు. చివరికి ఈ కేసులో విశాల్ ఫుకన్(22), అతని స్నేహితుడు స్వప్నిల్‌ను అరెస్టు చేశారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి విశాల్ నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించాడు.

ఆ డబ్బుతో ఫార్మాస్యూటికల్స్, ప్రొడక్షన్, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో విశాల్ పెట్టుబడి పెట్టి, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తేలింది. కొంత నగదును అస్సామీ సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు తేలింది. దిబ్రూగఢ్‌లోని విశాల్ నివాసంపై జరిపిన దాడిలో ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనితో సంబంధం ఉన్న అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం పోలీసులు వెతుకుతున్నారు.


అప్రమత్తత తప్పనిసరి..

ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని సీఎం హిమంత బిస్వ శర్మ ప్రజలకు సూచించారు. ఆర్థిక కుంభకోణం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. “ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థల ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి చట్టబద్ధమైన వ్యవస్థ లేదు. మోసగాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మోసాలకు దూరంగా ఉండాలని నేను అందరినీ కోరుతున్నాను”అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్రమ ఆన్‌లైన్ ట్రేడింగ్‌ను అరికట్టడానికి పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

For Latest News click here

Updated Date - Sep 05 , 2024 | 01:18 PM