Share News

Police Commemoration Day 2024: సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి

ABN , Publish Date - Oct 21 , 2024 | 08:34 AM

దేశవ్యాప్తంగా అనేక మంది పోలీసులు నేరాలను అదుపు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

Police Commemoration Day 2024: సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి

హైదరాబాద్: ‘‘కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి సంకేతాలైతే.. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్‌’’... ఇది ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగ్‌. కొందరి పోలీసులను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రపంచమంతా నిద్రపోతున్నా తాను మాత్రమే మేల్కొని డ్యూటీ చేసేది ఒక్క పోలీసు మాత్రమే. కుటుంబాన్ని, పండగలు పబ్బాలను సైతం త్యజించి... ప్రజల కోసం పనిచేసే రక్షక భటుల సేవలు అనిర్వచనీయం. ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వస్తదని తెలిసినా వెనుకడుగు వేయని ధీరులు. అసలు పోలీసులు లేని వ్యవస్థను ఊహించలేం.

ప్రజల రక్షణ కోసం పనిచేస్తూ విధి నిర్వహణలో ఎందరో అమరులైన సంఘటనలు ఉన్నాయి. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తారు. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటారు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది పోలీసులు నేరాలను అదుపు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..


నేపథ్యం..

1959 అక్టోబర్‌ 21న భారత జవాన్‌లు జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రం లడక్‌ జిల్లాలోని లెహ్‌ ప్రాంతంలో బందోబస్తులో ఉన్నారు. చైనా సైనికులు భారత జవాన్‌లపై దాడి చేయడంతో 11 మంది జవాన్‌లో మృతిచెందారు. వారి మృతదేహాలను తీసుకువచ్చే వీలు లేకపోవడంతో జవాన్‌ల మృతదేహాలను అక్కడే ఖననం చేశారు. కుటుంబీకులు వారిని కడసారి చూపునకు సైతం నోచుకోలేదు. అసువులు బాసిన జవాన్‌ల ఆత్మలకు శాంతి కలగాలని ఏటా అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల సంస్మరణ కార్యక్రమాలు..

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 31 వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఓపెన్‌ హౌజ్‌ నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ఆన్‌లైన్‌లో తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నారు. బెల్లంపల్లిలో డ్రగ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.


కానిస్టేబుల్‌ నుంచి ఎఎస్‌ఐ స్ధాయి అధికారి వరకు పోలీసులకు వ్యాసరచన పోటీలు (సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగు పర్చడం), ఎస్‌ఐ స్థాయి నుంచి ఆపై అధికారులకు (ధృడమైన శరీరంలో ధృడమైన మనసు) వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. బెల్లంపల్లి జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్‌ డివిజన్‌లు, పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో రక్తదాన శిబిరాలు, సైకిల్‌ ర్యాలీలు, అమరులకు నివాళులర్పించనున్నారు. ఏపీలోనూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోలీసు కళాబృందాలతో ఈ నెల 31 వరకు ప్రధాన కూడళ్ల వద్ద కళాజాత చేపట్టనున్నారు. ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వస్తుందని తెలిసినా వెనుకడుగు వేయని ధీరులు పోలీసులు. వారు లేని వ్యవస్థను ఊహించలేం. ప్రజల రక్షణ కోసం పనిచేస్తూ విధి నిర్వహణలో ఎందరో అమరులయ్యారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళులర్పిద్దాం.

Updated Date - Oct 21 , 2024 | 08:38 AM