Fake Court: మోసాల్లో నెక్స్ట్ లెవల్ ఇది.. నకిలీ కోర్ట్ సెటప్ వేసి ఏం చేశాడంటే..
ABN , Publish Date - Oct 23 , 2024 | 08:05 PM
ఓ వ్యక్తి మోసాలకు పాల్పడేందుకు ఏకంగా కోర్టునే ఎంచుకున్నాడు. ఏకంగా నకిలీ కోర్టు సెట్టింగ్ వేశాడు. కేసులు విచారించడం, తీర్పులు ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. ఇలా చాలనే చేశాడు. అయితే కలెక్టర్ పరిధిలోని ఓ వివాదాస్పద భూమి విషయంలో అతడు ఇచ్చిన ఫేక్ ఆదేశాలు అతడిని పట్టించాయి. ఆసక్తికరమైన ఈ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఫేక్ కరెన్సీ మోసాలు, ఫేక్ కాల్స్ ఛీటింగ్స్ గురించి వినే ఉంటారు. ఈ మధ్య కొత్తగా డిజిటల్ అరెస్టులు పేరిట కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అంతకుమించి అన్నట్టుగా తాజాగా నిర్ఘాంతపరిచే ఓ కొత్త మోసం వెలుగుచూసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో పోలీసులు ఒక షాకింగ్ మోసాన్ని గుర్తించారు. ఓ వ్యక్తి న్యాయమూర్తిగా నమ్మిస్తూ ఒక నకిలీ కోర్ట్ ట్రిబ్యునల్‌ను నిర్వహించాడు. 2019 నుంచి దొంగ తీర్పులు ఇస్తున్నాడు. ఎట్టకేలకు మోసం బయటపడి అరెస్ట్ అయ్యాడు. నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అని, చాలా మందిని మోసగించాడని, ముఖ్యంగా భూ వివాదాలలో నకిలీ తీర్పులు ఇచ్చి డబ్బు దండుకున్నాడని పోలీసులు వివరించారు. ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని అధికారులు తెలిపారు.
శామ్యూల్ తన ఫేక్ కార్యాలయంలో కోర్టు తరహా సెట్టింగ్‌ను వేశాడు. నిజమైన చట్టబద్ధ ట్రిబ్యునల్ మాదిరిగా దానికి ఒక రూపం తీసుకొచ్చాడు. దాదాపు ఐదేళ్లుగా దొంగ తీర్పులు ఇస్తూ జనాల్ని బోల్తాకొట్టిస్తున్నాడు. కోర్టు అధికారులుగా నమ్మించేందుకు మరికొంతమందిని సహాయకులుగా నియమించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా కొంతమంది ఫేక్ క్లయింట్లను కూడా పెట్టుకొని నమ్మించాడు. సంక్లిష్టమైన భూ వివాదాల్లో ఉన్న వ్యక్తులను గుర్తించి పరిష్కరిస్తానంటూ నమ్మించేవాడు. అందుకుగానూ పెద్ద మొత్తంలో ఫీజు రూపంలో డబ్బు తీసుకునేవాడని బయటపడింది.
బయటపడిందిలా..
2019లో ఎప్పటిలాగానే శామ్యూల్ తన క్లయింట్‌కు అనుకూలంగా ఇచ్చిన ఒక ఫేక్ ఆర్డర్ అతడిని పట్టించింది. పాల్డీ అనే ప్రాంతంలో జిల్లా కలెక్టర్ పరిధిలోని ప్రభుత్వ భూమి తనదంటూ, రెవెన్యూ రికార్డుల్లో తన పేరును చేర్చాలంటూ ఓ వ్యక్తి శామ్యూల్ సృష్టించిన ఫేక్ కోర్టును ఆశ్రయించాడు. తానే అధికారిక మధ్యవర్తిత్వ న్యాయమూర్తినంటూ నమ్మించిన శామ్యూల్.. భూవివాదం కేసును పరిష్కరిస్తానని నమ్మబలికాడు. సదరు క్లయింట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు.
భూమి హక్కులను ఆ వ్యక్తి పేరు మీదకు మార్చాలంటూ కలెక్టర్‌కు ఉత్వర్వులు పంపించినట్టుగా శామ్యూల్ ఫేక్ నోటీసులు జారీ చేశాడు. ఈ నోటీసులతో ఓ న్యాయవాది సాయంతో సిటీ సివిల్ కోర్టులో అప్పీల్ చేయించాడు. దీంతో అక్కడ అసలు విషయం వెలుగుచూసింది. శామ్యూల్ జారీ చేసింది మోసపూరిత ఆర్డర్ అని కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ గుర్తించారు. శామ్యూల్ మధ్యవర్తిత్వ జడ్జి కాదని, ట్రిబ్యునల్ ఆర్డర్ నిజమైనదని కాదని గుర్తించినట్టు చెప్పారు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితడు శామ్యూల్‌పై 2015లో కూడా ఒక చీటింగ్ ఫిర్యాదు నమోదయిందని గుర్తించారు.
కాగా నకిలీ కోర్టు పేరిట శామ్యూల్ ఎంతమందిని మోసం చేశాడనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వివరాలను లోతుగా తెలుసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
HCA: హెచ్‌సీఏ వివాదాలపై సుప్రీంకోర్టులో విచారణ
ఏపీలో లా అండ్ అర్డర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
తుపాను ఎఫెక్ట్.. రెండు రైళ్లు రద్దు
For more TS News and Telugu News