Share News

Ayodhya: అదిగో.. బాల రాముడు!

ABN , Publish Date - Jan 20 , 2024 | 01:28 AM

అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు మూడు రోజులు ముందే బాల రాముడి విగ్రహం తొలి చిత్రం శుక్రవారం వెలుగు చూసింది. కృష్ణశిలపై చెక్కిన రాముడి విగ్రహం ముగ్ధమనోహరంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహంలో శ్రీరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో బంగారు

Ayodhya: అదిగో.. బాల రాముడు!
చేతిలో బంగారు ధనస్సుతో ఉన్న బాల రాముడి విగ్రహం.

పద్మపీఠంపై ముగ్ధమనోహర రూపం

ప్రాణప్రతిష్ఠకు ముందే 4.25 అడుగుల

ఎత్తైన బాలరాముని దివ్య దర్శనం

అయోధ్యకు తరలివస్తున్న భక్తులు

అయోధ్య, జనవరి 19: అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు మూడు రోజులు ముందే బాల రాముడి విగ్రహం తొలి చిత్రం శుక్రవారం వెలుగు చూసింది. కృష్ణశిలపై చెక్కిన రాముడి విగ్రహం ముగ్ధమనోహరంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహంలో శ్రీరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకొని ఉన్న ఐదేళ్ల బాలుడి రూపంలో దర్శనమిస్తున్నారు. ఆలయంలో ప్రతిష్ఠించాల్సిన విగ్రహాన్ని గురువారం వేకువజామున గర్భగుడిలోకి ప్రవేశపెట్టారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కిన 51 అంగుళాల విగ్రహాన్ని పవిత్ర జలాలతో అభిషేకించి ఆసనంపైకి చేర్చారు. సోమవారం ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్న నేపథ్యంలో ట్రస్టు అధికారులు ముందుగా తెల్లటి వస్త్రం కప్పి ఉన్న విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచుతున్న ఫొటోలను గురువారం విడుదల చేశారు. విగ్రహం కళ్లు పసుపు వస్త్రంతో కప్పి ఉన్న మరో ఫొటో శుక్రవారం ఉదయం బయటకు వచ్చింది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాముడి చేతిలో బంగారు విల్లు, బాణం ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా, ప్రాణప్రతిష్ఠలో వినియోగించడానికి మహారాష్ట్రలోని అమరావతి నుంచి అయోధ్యకు 500 కిలోల కుంకుమను కానుకగా పంపారు. కర్ణాటకలోని హంపి ప్రాంతంలో ఉన్న హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శిస్తూ, అయోధ్యకు చేరేముందు ఈ రథాన్ని నేపాల్‌లోని సీతా మాత జన్మస్థలమైన జనక్‌పూర్‌కు తీసుకెళ్లారు. భక్తుల సందర్శనార్థం ఈ రథాన్ని సరయూ నది ఒడ్డున నిలిపి ఉంచారు.

దారులన్నీ అయోధ్యకే

అందరి గమ్యం ఒకటే... దారులన్నీ అయోధ్యకే... ఎముకలు కొరికే చలి కూడా వారిని అడ్డుకోలేకపోతోంది. 22న జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠను కనులారా వీక్షించి తరలించడానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వెల్లువలా తరలి వస్తున్నారు. వందలాది కిలోమీటర్ల దూరాన్ని కొందరు కాలి నడకన అధిగమిస్తుండగా, మరికొందరు సైకిళ్లపైనా, ఇంకొందరు స్కేటింగ్‌ చేసుకుంటూ అయోధ్య దిశగా ముందుకు సాగుతున్నారు. రాముడిపై ఉన్న అచంచల విశ్వాసంతో ఈ చరిత్రాత్మక ఘట్టంలో తాము కూడా భాగం కావాలని ఉవ్విళూరుతున్నారు. బిహార్‌లోని మాథేపురా జిల్లాకు చెందిన నితీశ్‌ కుమార్‌(21) సైకిల్‌పై 615 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నారు. గిన్నిస్‌ బుక్‌లో లాంగెస్ట్‌ డ్యాన్స్‌ మారథాన్‌ (124 గంటలు) రికార్డును సొంతం చేసుకున్న సోనీ చౌరాసియా ఆహ్వానితుల్లో ఒకరు. ఆమె వారాణసీ నుంచి స్కేటింగ్‌ చేస్తూ అయోధ్యకు వెళ్తున్నారు. హిందూ ముస్లింల ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ముంబైకి చెందిన షబ్నమ్‌ షేక్‌ అయోధ్యకు కాలినడకన వస్తున్నారు. మహాత్మా గాంధీ వేషధారణలో కర్ణాటకలోని కరాకిట్టి ప్రాంతానికి చెందిన ముత్నా తిర్లాపుర 2000 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నారు.

రామయ్యకు కానుకల వెల్లువ

అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరగబోయే వేడుకకు కనౌజ్‌ నుంచి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి. ఇవేకాకుండా 108 అడుగుల అగరుబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కిలోల భారీ దీపం, బంగారు పాదుకలు, పది అడుగుల తాళం, ఏకకాలంలో 8దేశాల సమయాన్ని సూచించే గడియారం ట్రస్టుకు అందాయి. సీతమ్మ జన్మస్థలం నేపాల్‌లోని జనక్‌పూర్‌ ధామ్‌ నుంచి వెండి పాదరక్షలు, ఆభరణాలు, వస్త్రాలతో పాటు 3వేలకు పైగా బహుమతులు కాన్వాయ్‌గా వచ్చాయి. శ్రీలంక ప్రతినిధి బృందం అశోకవాటిక నుంచి ప్రత్యేక కానుక తీసుకొచ్చింది. ఉజ్జయిని మహాకాలేశ్వర్‌ ఆలయం నుంచి 5లక్షల లడ్డూలతో కూడిన ట్రక్‌ శుక్రవారం అయోధ్యకు బయల్దేరింది. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్‌ నుంచి 200 కిలోల లడ్డూలు, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డూలు పంపారు. భక్తుల కోసం 7వేల కిలోల రామ్‌ హల్వాను తయారు చేయనున్నట్లు నాగపూర్‌కు చెందిన చెఫ్‌ విష్ణు మనోహర్‌ ప్రకటించారు. రాముడికి బంగారు పూతపూసిన పాదరక్షలను సమర్పించడానికి హైదరాబాద్‌కు చెందిన 64ఏళ్ల చల్లా శ్రీనివాస శాస్త్రి 8వేల కిలోమీటర్లు నడిచి అయోధ్యకు చేరుకున్నారు.

అంతా రామమయం!

రామాలయ ప్రతిష్ఠకు ముందు.. అయోధ్య మొత్తం రామమయమైంది. మొబైల్‌ ఫోన్ల కాలర్‌ ట్యూన్స్‌, రింగ్‌ టోన్లు, సోషల్‌ మీడియాలో శ్రీరాముడి పేరు మార్మోగిపోతోంది. అయోధ్య వీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. మరోవైపు, రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు అయోధ్య జిల్లా, నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లను రిజర్వ్‌ చేసి ఉంచారు. అత్యవసర సమయంలో ఎలా స్పందించాలో ఎయిమ్స్‌ నిపుణులు స్థానిక ఆరోగ్య సంస్థల సిబ్బందికి శిక్షణ అందించారు. ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే వారికోసం ఈ బెడ్లను రిజర్వ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 7 వేల మంది అతిథులను ఆహ్వానించారు. కాగా, అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌ జైళ్లలోని ఖైదీలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించనున్నారు.

ఈ ఫొటో శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

శుక్రవారం సాయంత్రం దీప కాంతులతో వెలిగిపోతున్న అయోధ్య రామాలయం

భద్రతా వలయంలో అయోధ్య..

అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణపత్రిష్ఠకు సమయం దగ్గర పడడం, ఆలయ అధికారులకు ఇటీవలే ఓ బెదిరింపు కాల్‌ రావడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రత ఉల్లంఘన జరిగినట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి సమాచారం అందడంతో.. భద్రతను కట్టుదిట్టం చేసి అయోధ్య మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయోధ్య నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 వేల మంది పోలీస్‌ సిబ్బందిని మోహరించారు. బెదిరింపుల నేపథ్యంలో భద్రతను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ‘అయోధ్యలో మొత్తం 10వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఫేస్‌ రికగ్నిషన్‌ కోసం ఏఐని ఉపయోగిస్తున్నాం’ అని ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు.

ఆ రథం తయారీ మధురానుభూతి

ముంబై, జనవరి 19: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే ఆడ్వాణీ 1990లో చేపట్టిన రథయాత్రకు రథాన్ని తయారు చేయడం.. తనకు ఇప్పటికీ నూతనోత్సాహాన్ని ఇస్తుందని ముంబైకి చెందిన ప్రకాశ్‌ నలవాడె అన్నారు. ఆడ్వాణీ రథయాత్రకు రథాన్ని సిద్ధం చేసింది ఈయనే. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రథయాత్రకు కొన్ని రోజుల ముందు బీజేపీ నేత ప్రమోద్‌ మహాజన్‌ నన్ను సంప్రదించారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ శాంతి దేవ్‌ ఈ రథాన్ని డిజైన్‌ చేశారు. ఆ ప్రకారం నేను దాన్ని రూపొందించాను. దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని ప్రకాశ్‌ చెప్పారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల కేంద్రానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి కేవలం 2.73 గ్రాముల బంగారంతో అయోధ్య రామ మందిర నమూనాను తయారు చేశాడు. 1.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.75 సెంటీమీటర్ల వెడల్పు, 2.75 సెంటీమీటర్ల పొడవుతో 108 స్తంభాలు, 20 గోపురాలు వచ్చే విధంగా ఆలయ నమూనాను రూపుదిద్ది అందరినీ అబ్బురపరిచాడు.

- అమ్రాబాద్‌

వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని యాంకి గ్రామానికి చెందిన కళాకారుడు సున్నపు అశోక్‌ ఐస్‌క్రీమ్‌ పుల్లలతో అయోధ్య రామమందిర నమూనాను తయారు చేసి అబ్బురపరిచాడు. 2వేల పుల్లలను ఉపయోగించి రోజుకు గంట చొప్పున 20 రోజులు శ్రమించి ఆలయ నమూనాను తయారు చేసినట్లు అతడు చెప్పాడు.

- దౌల్తాబాద్‌

భద్రతా వలయంలో అయోధ్య..

అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణపత్రిష్ఠకు సమయం దగ్గర పడడం, ఆలయ అధికారులకు ఇటీవలే ఓ బెదిరింపు కాల్‌ రావడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రత ఉల్లంఘన జరిగినట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి సమాచారం అందడంతో.. భద్రతను కట్టుదిట్టం చేసి అయోధ్య మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయోధ్య నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 వేల మంది పోలీస్‌ సిబ్బందిని మోహరించారు. బెదిరింపుల నేపథ్యంలో భద్రతను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ‘అయోధ్యలో మొత్తం 10వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఫేస్‌ రికగ్నిషన్‌ కోసం ఏఐని ఉపయోగిస్తున్నాం’ అని ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు.

అయోధ్య ఆలయ ప్రారంభానికి చంద్రబాబు

అమరావతి, జనవ రి 19(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆలయ ట్రస్ట్‌ ఆయనకు ఆహ్వానం పంపింది. దీనితో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన నిర్ణయించుకొన్నారు. ఖరారైన కార్యక్రమం ప్రకారం ఈ నెల 21న సాయంత్రం ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరి అయోధ్య వెళ్తారు. ఆ రాత్రి అక్కడ బస చేసి 22న ఉదయం ఆలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు అక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్‌ తిరిగి వస్తారు. దీని నిమిత్తం ఈ నెల 21 నుంచి 23 వరకూ ఆయన తన జిల్లాల పర్యటనకు విరామం ఇచ్చారు. మళ్లీ 24 నుంచి ఆయన పర్యటనలు ప్రారంభిస్తారు.

Updated Date - Jan 20 , 2024 | 06:45 AM