Share News

TamilNadu : తమిళిసైతో అన్నామలై భేటీ

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:02 AM

తమిళనాడు బీజేపీలో వర్గపోరు చల్లబడినట్లే కనిపిస్తోంది. ఇటీవల తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ గవర్నర్‌, బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో అధ్యక్షుడు అన్నామలై తాజాగా భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని సాలిగ్రామంలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో గంటపాటు సమావేశమయ్యారు.

TamilNadu : తమిళిసైతో అన్నామలై భేటీ

చెన్నై, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు బీజేపీలో వర్గపోరు చల్లబడినట్లే కనిపిస్తోంది. ఇటీవల తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ గవర్నర్‌, బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో అధ్యక్షుడు అన్నామలై తాజాగా భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని సాలిగ్రామంలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం అన్నామలై తన ‘ఎక్స్‌’ పేజీలో ఓ సందేశం వెలువరించారు. ‘అక్క తమిళిసైతో భేటీ కావటం నాకెంతో సంతోషంగా ఉంది’ అన్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా కమలం వికసిస్తుందన్నారు. దీనికోసం ఆమె రాజకీయ అనుభవాలు, సలహాలు స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నారు. కాగా అంతకు ముందు గురువారం రాత్రి తమిళిసై తన ఎక్స్‌ పేజీలో అమరావతిలో అమిత్‌షాతో తాను జరిపిన సంభాషణపై వివరణ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అమిత్‌షా తనతో చర్చించారని పేర్కొన్నారు. అంతేకాకుండా నియోజకవర్గాలవారీగా పార్టీని అభివృద్ధిపరిచే విషయంపై దృష్టిసారించాలంటూ ఆయన సలహా ఇచ్చారని, ఆ సలహాలు తనకు ఎంతో ఉద్వేగాన్ని కలిగించాయని వ్యాఖ్యానించారు. తమిళిసై-అన్నామలై ఇలా స్పందించడంతో ఇప్పటికి వీరి మధ్య వివాదం సమసినట్లేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.


ఇంతకీ అసలేం జరిగింది?

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ తమిళనాడు శాఖలో చిచ్చు రేగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షులు తమిళిసై, పొన్‌ రాధాకృష్ణన్‌, ఎల్‌.మురుగన్‌ తదితరులంతా ఓటమి చెందిన విషయం తెలిసిందే. దక్షిణచెన్నై లోక్‌సభ నియోజకవర్గంలో పరాజయం పొందిన తమిళిసై.. అన్నామలైపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యూహరచన సరిగ్గా లేదని, అన్నాడీఎంకేతో పొత్తు వుంటే తమ పార్టీ విజయం సాధించేదన్నారు. అనేకమంది క్రిమినల్స్‌ని అన్నామలై పార్టీలో చేర్చుకున్నారని, తాను అధ్యక్షురాలిగా ఉంటే వారిని దరిచేరనిచ్చేదాన్ని కాదంటూ వ్యాఖ్యానించారు. వీటన్నింటి నేపథ్యంలోనే అమిత్‌షా తమిళిసైని గత బుధవారం సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ వేదికపై హెచ్చరించారు. కాగా, ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇద్దరు నేతల భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Jun 15 , 2024 | 06:15 AM