Share News

Prime Minister Modi : నవ శకానికి శ్రీకారం

ABN , Publish Date - Jan 23 , 2024 | 04:15 AM

అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపన.. నవశకానికి శ్రీకారం చుట్టిందని ప్రధాని మోదీ అన్నారు. పురోగామి, ప్రగతిశీల భారతానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. సోమవారమిక్కడ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ అనంతరం ఆయన సాధు సంతులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, కవు

 Prime Minister Modi : నవ శకానికి శ్రీకారం

రాముడొచ్చేశాడు.. ఇక టెంట్లో ఉండక్కర్లేదు

కర్తవ్య నిర్వహణే ఘనభారతానికి పునాది

అయోధ్యలో ప్రధాని మోదీ ఉద్ఘాటన

అయోధ్య, జనవరి 22: అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపన.. నవశకానికి శ్రీకారం చుట్టిందని ప్రధాని మోదీ అన్నారు. పురోగామి, ప్రగతిశీల భారతానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. సోమవారమిక్కడ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ అనంతరం ఆయన సాధు సంతులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, కవులు, కళాకారులు, సినీనటులు, సాహితీవేత్తల సమావేశంలో మాట్లాడారు. 2024 జనవరి 22.. కేలెండర్‌లో ఒకానొక తేదీ మాత్రమే కాదని కొత్త శకానికి ఆరంభంగా పేర్కొన్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ కేవలం విజయ సందర్భమే కాదు.. వినమ్రతకూ సంకేతమన్నారు. ఇక ఆలయ నిర్మాణ అంశాన్ని మనం అధిగమించాలని సూచించారు. ఈ పవిత్ర క్షణం నుంచి వచ్చే వెయ్యేళ్లకు పటిష్ఠ, భవ్య, ఆధ్యాత్మిక భారతానికి పునాది వేయాలని పిలుపిచ్చారు. ‘తరాల ఎదురుతెన్నుల అనంతరం ఇవాళ మన రాముడు వచ్చేశాడు.. ఇక టెంట్లలో ఉండడు.. అద్భుత ఆలయంలో నివసిస్తాడు. ఆలయ నిర్మాణం ప్రజల్లో కొత్త జవసత్వాలు నింపింది. గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ సమయంలో నాలో కలిగిన దివ్య ప్రకంపనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వెయ్యేళ్ల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీని, ఈ క్షణాలను గుర్తుంచుకుంటారు. శ్రీరాముడి ఆశీర్వాదం వల్లే మనమీ అద్భుత ఘట్టాన్ని చూడగలుగుతున్నాం. దీర్ఘకాలంగా మనమీ నిర్మాణం పూర్తిచేయలేకపోయాం. మన తపస్సులో లోపాలకు శ్రీరాముడికి క్షమాపణలు చెబుతున్నాను. ఆయన కచ్చితంగా మన్నిస్తాడని ఆశిస్తున్నాను. ప్రాణప్రతిష్ఠ వేడుకతో యావత్‌ ప్రపంచాన్ని సంధానించాం. అయోధ్యలో జరిగినటువంటి ఉత్సవాలు ఇతర దేశాల్లో కూడా జరిగాయి. శ్రీరాముడు భారతీయుల విశ్వాసం. ఈ దేశానికి ఆధారం.. భారత్‌లో నియమ నిబంధనలను ఏర్పాటు చేసిందే ఆయన.. భారతీయ వివేచన, గర్వం.. ఘనత ఆయనే. ఆయన విశ్వవ్యాపకుడు.. ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామంటే.. దాని ప్రభావం కొన్నేళ్లు కాదు... వందలు, వేల సంవత్సరాలు ఉంటుంది. యుగసంధి రూపకర్తలుగా మన తరం ఎంపిక కావడం సంతోషదాయకమైన యాదృచ్ఛిక సంఘటన. వెయ్యేళ్ల తర్వాత కూడా జాతి నిర్మాణంలో మన కృషిని అప్పటి తరం గుర్తుంచుకుంటుంది’ అని తెలిపారు. అంతకుముందు ఆయన అయోధ్యలోని కుబేర్‌ టీలాలో శివుడికి పూజలు చేశారు. జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Updated Date - Jan 23 , 2024 | 04:17 AM