Share News

Delhi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌కు ఘన నివాళులు అర్పించిన ప్రధాని మోదీ..

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:57 AM

భారత మాజీ ప్రధాన మంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌(92) మరణవార్త విని నివాళులు అర్పించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్దఎత్తున ప్రముఖులు తరలివస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వృద్ధాప్య సమస్యలతో గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ మరణించారు.

Delhi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌కు ఘన నివాళులు అర్పించిన ప్రధాని మోదీ..
Prime Minister Narendra Modi

ఢిల్లీ: భారత మాజీ ప్రధాన మంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌ (Manmohan Singh) మరణవార్త విని నివాళులు అర్పించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్దఎత్తున ప్రముఖులు తరలివస్తున్నారు. ఢిల్లీ(Delhi)లోని ఎయిమ్స్‌(AIMS)లో వృద్ధాప్య సమస్యలతో గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ మరణించారు. ఆయన మృతదేహాన్ని అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రు మార్గ్-3కి తరలించగా నివాళులు అర్పించేందుకు ప్రముఖులు తండోపతండాలుగా వస్తున్నారు.


ప్రధాని మోదీ, సోనియా గాంధీ నివాళి..

శుక్రవారం ఉదయం 10 గంటలకు మన్మోహన్ నివాసం వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్‌, కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే.. మన్మోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.


బయలుదేరిన తెలుగు సీఎంలు..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం నేడు ఢిల్లీకి చేరుకుని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం మాజీ ప్రధాని నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. కర్ణాటక రాష్ట్రం బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు. మరోవైపు తండ్రి మరణ వార్త విన్న మన్మోహన్ కుమార్తె కూడా అమెరికా నుంచి ఢిల్లీకి బయలుదేరారు.


రేపు అక్కడికి..

అయితే ఇవాళ మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ప్రముఖుల సందర్శనార్థం ఢిల్లీలోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. కాగా, రేపు (శనివారం) ఏఐసీసీ కేంద్ర కార్యాలయానికి మాజీ ప్రధాని పార్థివదేహాన్ని తరలించనున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఏఐసీసీలో ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో రాజ్ ఘాట్ వద్ద మన్మోహన్ సింగ్ అంతక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

AP News: మాజీ ప్రధాని మన్మోహన్ మృతి.. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన తెలుగు ప్రముఖులు...

AP News: ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా ఆందోళన.. ఎక్కడంటే

Updated Date - Dec 27 , 2024 | 11:28 AM