Share News

Haryana: డ్రైవర్ మద్యం తాగటంతోనే స్కూల్ బస్సు ప్రమాద ఘటన.. ప్రిన్సిపల్ సహా ఇద్దరు అరెస్ట్

ABN , Publish Date - Apr 11 , 2024 | 08:57 PM

హర్యానాలో గురువారం ఉదయం ఆరుగురు విద్యార్థులను చిదిమేసిన స్కూల్ బస్ ఘటనలో ప్రిన్సిపల్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్సు డ్రైవర్‌, పాఠశాల కార్యదర్శి కూడా ఉన్నారు. డ్రైవర్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Haryana: డ్రైవర్ మద్యం తాగటంతోనే స్కూల్ బస్సు ప్రమాద ఘటన.. ప్రిన్సిపల్ సహా ఇద్దరు అరెస్ట్

హర్యానా: హర్యానాలో గురువారం ఉదయం ఆరుగురు విద్యార్థులను చిదిమేసిన స్కూల్ బస్ ఘటనలో ప్రిన్సిపల్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్సు డ్రైవర్‌, పాఠశాల కార్యదర్శి కూడా ఉన్నారు. డ్రైవర్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో చేరిన విద్యార్థులలో పద్నాలుగు మంది డిశ్చార్జ్ అయ్యారు. వారిలో ముగ్గురు పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బస్సు పాఠశాలకు చెందినదని.. దాని ఫిట్‌నెస్ సర్టిఫికేట్ గడువు 2018లోనే ముగిసిందని అధికారులు చెప్పారు. ఫిట్‌నెస్ తనిఖీ చేపట్టని కారణంగా రోడ్డు రవాణా అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

డీఎస్పీ మహేంద్ర రాణా మాట్లాడుతూ.. "నిందితులపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేనందున మోటారు వాహన చట్టంలోని సెక్షన్లు కూడా వర్తింపజేశాం. డ్రైవర్ ధర్మేంద్ర, ప్రిన్సిపాల్ దీప్తి, సిబ్బంది హోషియార్ సింగ్‌ను అరెస్టు చేశాం. డ్రైవర్ రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు వైద్య పరీక్షలో నిర్ధారణ అయింది. ఈ మధ్యే బస్సుపై చలానా కూడా విధించాం" అని తెలిపారు. సెలవు దినమైన ఈద్ రోజున తరగతులు ఎందుకు నిర్వహిస్తున్నారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా తెలిపారు. "రంజాన్ రోజు పాఠశాలలకు సెలవు. విద్యాశాఖ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలల నుంచి స్వీయ అఫిడవిట్‌లు తీసుకున్నాం. రవాణా నియమాలు పాటించని పాఠశాలల బస్సులు సీజ్ చేస్తున్నాం" అని ఆమె అన్నారు.


జరిగిందిదే..

హర్యానా రాష్ట్రం మహేంద్రగఢ్ జిల్లాలో ఇవాళ ఉదయమే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయింది. దీంతో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35-40 మంది విద్యార్థులు ఉన్నారు. సెలవు రోజు అయినప్పటికీ ప్రైవేటు పాఠశాల సెలవు ఇవ్వలేదు.

Amith Shah: ఆర్టికల్ 370ని మార్చే ధైర్యం ఉందా.. కాంగ్రెస్‌కు అమిత్ షా గట్టి హెచ్చరిక

ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా స్కూల్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. స్థానికుల ద్వారా ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు హుటాహుటిన స్పాట్ కు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాయపడిన వారు ఆక్రందనలు, మృతుల కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 08:58 PM