Indian Politcs: జైలుకెళ్లొస్తే జై..
ABN , Publish Date - Nov 24 , 2024 | 04:17 AM
రుగు పొరుగున ఉండే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలిస్తే చాలు.. ఆ వ్యక్తి కుటుంబంతో మాట్లాడానికి కూడా కొద్ది రోజులు జనం సంశయిస్తారు. నేరం చేశాడా లేదా అనే సంగతి పక్కనపెడితే.. అరెస్టయిన వ్యక్తి
కారాగారం టూ అధికారం..
ఇరుగు పొరుగున ఉండే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలిస్తే చాలు.. ఆ వ్యక్తి కుటుంబంతో మాట్లాడానికి కూడా కొద్ది రోజులు జనం సంశయిస్తారు. నేరం చేశాడా లేదా అనే సంగతి పక్కనపెడితే.. అరెస్టయిన వ్యక్తి పొరపాటున ఎదురైతే చూసీచూడనట్టుగా తప్పుకుని వెళ్లిపోతారు. ఇదంతా సామాన్యుల వరకే... అదే ఓ రాజకీయ నాయకుడు జైలుకెళ్తే ఆ లెక్క వేరే ఉంటోంది. ఆ నాయకుడి గతం, ఏ నేరారోపణపై జైలుకు వెళ్లాడు వంటి విషయాలన్నీ గాల్లో కలిసిపోతాయి. సదరు నేతను ప్రత్యర్థి పార్టీ అక్రమంగా జైలుకు పంపింది.. అనే వాదం తెరపైకి వస్తుంది. కటకటాల వెనుక ఉన్న నాయకుడు తన ప్రత్యర్థి అయిన అధికార పార్టీ కుట్రను ఎదుర్కోని నిలబడ్డ హీరోగా అవతరిస్తాడు. చివరికి జనమంతా కలిసి ఆ నాయకుడు, అతని పార్టీని అందలం ఎక్కిస్తారు. వెరసి జైలుకెళ్లి వస్తే అధికారం గ్యారం టీ అనేలా దేశ రాజకీయాల పరిస్థితి మారింది. ఇందుకు నిదర్శనంగా నిలిచిన ఇటీవల జరిగిన కొన్ని ఘటనలివి.
హేమంత్ సోరెన్ : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ను ఓ భూకుంభకోణం కేసులో ఈడీ 2024 జనవరి 31న అరెస్టు చేసింది. అప్పటికే ముఖ్యమంత్రి అయిన హేమంత్ అరెస్టు అయిన కాసేపటికే తన పదవికి రాజీనామా చేశారు. 149 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. జూలై 4న తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేఎంఎం ఆధ్వర్యంలోని ఇండియా కూటమి విజయం సాధించడంతో మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
నారా చంద్రబాబు నాయుడు : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో 2023లో అప్పటి ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. 53 రోజులు జైలు జీవితం గడిపిన చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యారు. చంద్రబాబును జైలుపాలు చెయ్యడం అధికార పార్టీ వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి కనీవినీ ఎరుగని మెజారిటీతో విజయం సాధించింది. చంద్రబాబు తిరిగి సీఎం అయ్యారు.
వైఎస్ జగన్ : వైఎస్ జగన్‌ను అక్రమాస్తుల కేసులో 2012 మే 27న సీబీఐ అరెస్టు చేయగా దాదాపు 16 నెలల జైలు జీవితం గడిపారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ వైసీపీ 67 స్థానాల్లో గెలవడంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఇక, 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు.
రేవంత్ రెడ్డి : బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు చెందిన ఫామ్‌హౌ్‌సపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారనే ఆరోపణలతో 2020 మార్చి 5న రేవంత్ రెడ్డి(అప్పట్లో ఎంపీ)ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక రేవంత్ 2021 జూలైలో టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని ముఖ్యమంత్రి అయ్యారు.
డీకే శివకుమార్ : డీకే శివకుమార్‌ను మనీ లాండరింగ్ కేసులో 2019 సెప్టెంబరు 3న ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో 2019 అక్టోబరు 23న విడుదలయ్యారు. అనంతరం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమతులైన డీకే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
ఒమర్ అబ్దుల్లా : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లాను కేంద్ర ప్రభుత్వం 232 రోజులు గృహ నిర్బంధంలో ఉంచింది. 2019 ఆగస్టు 5 నుంచి 2020 మార్చి 24 దాకా ఒమర్ నిర్బంధంలో ఉన్నారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒమర్ గెలుపొందగా ఆయన పార్టీ ఎన్‌సీ మొత్తం 42 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. ఒమర్ ముఖ్యమంత్రి అయ్యారు.
- సెంట్రల్ డెస్క్