Stray Dogs: పంజాబ్‌లో మహిళపై 20 వీధి కుక్కల దాడి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి..
ABN , First Publish Date - 2024-02-07T18:07:32+05:30 IST
రానురాను వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమో, ప్రాణాలు తీయడమో చేస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోనూ ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఒంటరిగా కనిపించిన మహిళపై ఏకంగా 20 వీధి కుక్కలు దాడి చేశాయి.
రానురాను వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమో, ప్రాణాలు తీయడమో చేస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోనూ ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఒంటరిగా కనిపించిన మహిళపై ఏకంగా 20 వీధి కుక్కలు దాడి చేశాయి. ఎలాగైతే జంతవుల్ని పీక్కుతింటాయో.. అలాగే ఈ మహిళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన కపుర్తలా జిల్లాలోని పస్సాన్ కడిమ్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత మహిళను పరిదేవి(32)గా గుర్తించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేవల్ కుమార్, అతని భార్య పరిదేవి పస్సాన్ కడిమ్ గ్రామం వెలుపల ఉన్న ఒక మురికివాడలో నివసిస్తున్నారు. తమ జంతవుల కోసం పశుగ్రాసం తీసుకురావడానికి తరచూ పొలాల్లోకి వెళ్తుంటుంది. ఎప్పట్లాగే మంగళవారం సాయంత్రం కూడా ఆమె మేత కోసం పొలాల్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై ఏకంగా 20 వీధి కుక్కలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడేందుకు ఆమె ఎంతో ప్రయత్నించింది కానీ, వీలు పడలేదు. ఆ కుక్కలు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాయి. చనిపోయిన జంతువుల్ని ఎలా పళ్లతో కొరుకుతాయో.. అలాగే ఆమె ఛాతి, తల, చేతులు, కాళ్లు, పుర్రెను కుక్కలు కొరికేశాయి. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
అటు.. మేత కోసం వెళ్లిన తన భార్య ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కేవల్ కుమార్ ఆమెని వెతుక్కుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే.. అతనికి పొలాల్లో తన భార్య మృతదేహం ముక్కలైన స్థితిలో కనిపించింది. అది చూసి కుమార్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు, శోకసంద్రంలో మునిగిపోయాడు. గ్రామస్తుల సహకారంతో పరిదేవి మృతదేహాన్ని సుల్తాన్‌పూర్‌లోని సివిల్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, దర్యాప్తు చేపట్టారు. అటు.. జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వీధి కుక్కలపై చర్యలు ప్రారంభించింది.
కాగా.. పస్సాన్ కడీమ్ గ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది మూడోసారి. కొద్దిరోజుల క్రితమే అస్సు కుమార్ అనే ఓ కుర్రాడి ప్రాణాలను వీధికుక్కలు పొట్టన పెట్టుకున్నాయి. అంతకుముందు పింకీ దేవి అనే మహిళపై కూడా వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె సివిల్ హాస్పిటల్‌లో జీవన్మరణాల మధ్య పోరాడుతోంది. ఈ ఘటనలు చూసి.. గ్రామంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.