Share News

Bhubaneswar: కాసేపట్లో తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం..

ABN , Publish Date - Jul 14 , 2024 | 10:34 AM

భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రం పూరీ క్షేత్ర రత్నభాండాగారం మరి కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి, అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది.

Bhubaneswar: కాసేపట్లో తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం..

భువనేశ్వర్: ఒడిషా (Odisha) రాష్ట్రం పూరీ (Puri) క్షేత్ర రత్నభాండాగారం (Gem Treasury) మరి కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి, అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ (BJP) హామీ ఇచ్చింది.


ఈ నేపథ్యంలోనే ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ (Justice Bishwanath Rath) అధ్యక్షతన 16 మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇవాళ భాండాగారాన్ని తెరవాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిటీ సభ్యులంతా సంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి (Lord Jagannath) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఖజానా ఉన్న గదిలోకి అధీకృత సిబ్బందితో పాటు పాములు పట్టే వ్యక్తి మొదటగా ప్రవేశిస్తారు. నాలుగు దశాబ్దాలకు పైగా మూసి ఉన్న గదిని తెరవనుండటంతో అందులో భారీ విష సర్పాలు ఉంటాయన్న ఆందోళన నెలకొంది.


ఒకవేళ విషపురుగు కాటు వేసినా సత్వర చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. భాండాగారంలోకి ప్రవేశించే కమిటీ సభ్యులందరూ గత వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ, పూర్తి నియమ నిష్టలు పాటిస్తున్నారు. ఖజానాలోని ఆభరణాల గుర్తింపు ప్రక్రియను స్వర్ణకారులతో పాటు వాతావరణ శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షణలో చేపట్టనున్నట్లు జస్టిస్‌ రథ్‌ తెలిపారు. రహస్య గదులకు ఏఎస్‌ఐ మరమ్మతులు చేపట్టనుండటంతో అక్కడే లెక్కింపు సాధ్యం కాదని, అందులోని సంపదను ఆలయంలోనే మరో సురక్షితమైన ప్రాంతానికి తరలించి పటిష్ఠ భద్రత ఏర్పాట్ల నడుమ లెక్కిస్తామని వివరించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రూపంలో భద్రపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో భక్తులకు దర్శనాలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

Updated Date - Jul 14 , 2024 | 10:36 AM