Rahul Gandhi : మీరు హిందువులు కాదు!
ABN , Publish Date - Jul 02 , 2024 | 05:28 AM
బీజేపీ వాళ్లు హిందువులే కాదని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. భయాన్ని, విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాపింపజేయడం హిందూధర్మం కాదని చెప్పారు. తాము హిందువులమని చెప్పుకొంటున్న వారు నిత్యం హింస, విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్, ప్రధాని మోదీ వీరెవరూ మొత్తం హిందూ సమాజానికి ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే
హిందూధర్మం అహింస, నిర్భీతిని ప్రవచిస్తే..
మీరు హింస, ద్వేషం వ్యాపింపజేస్తున్నారు
అధికార పక్షానికి 24 గంటలూ అదే పని
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు
హిందూ సమాజాన్నే హింసావాదులంటారా?
రాహుల్ వ్యాఖ్యలు తీవ్రమైన విషయం: మోదీ
న్యూఢిల్లీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): బీజేపీ వాళ్లు హిందువులే కాదని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. భయాన్ని, విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాపింపజేయడం హిందూధర్మం కాదని చెప్పారు. తాము హిందువులమని చెప్పుకొంటున్న వారు నిత్యం హింస, విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్, ప్రధాని మోదీ వీరెవరూ మొత్తం హిందూ సమాజానికి ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం మధ్యాహ్నం సభలో రాహుల్‌గాంధీ విపక్ష నేత హోదాలో తొలిసారిగా మాట్లాడారు. సందర్శకుల గ్యాలరీ నుంచి తల్లి సోనియా, సోదరి ప్రియాంక చూస్తుండగా సుదీర్ఘంగా గంటా 40 నిమిషాలపాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడటానికి లేవగానే బీజేపీ సభ్యులు జైశ్రీరాం అని, విపక్ష సభ్యులు జైసంవిధాన్ అని పోటాపోటీ నినాదాలు చేశారు. ప్రసంగంలో భాగంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. మొత్తం అధికారపక్షం లేచి నిలబడింది. స్వయంగా ప్రధాని మోదీ రెండుసార్లు, మధ్యలో ఐదుగురు మంత్రులు ఒక్కోసారి రాహుల్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. అయితే, రాహుల్ ఎక్కడా తలొగ్గకుండా తన ప్రసంగ ధాటిని కొనసాగించారు. ధైర్యం గురించి అన్ని మతాలు చెప్పాయని, ఖురాన్ కూడా నిర్భీతిని ప్రబోధించిందని, దువా(ఆశీస్సుల) కోసం లేచే చేతిలో కనిపించేది అభయ ముద్రేనని రాహుల్‌గాంధీ చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ సభలో శివుడు, జీసస్, గురునానక్ చిత్రాలను ప్రదర్శించారు. హిందూత్వం, ఇస్లాం, సిక్కు, క్రైస్తవం, బౌద్ధ, జైన మతాలు నిర్భీతిని ప్రబోధించాయని గుర్తు చేశారు. వీళ్లందరూ భయపడొద్దు.. భయపెట్టొద్దు అని చెప్పారన్నారు. పరమ శివుడు కూడా ఎవరికీ భయపడొద్దు, ఎవర్నీ భయపెట్టొద్దని అభయ హస్తాన్ని చూపుతున్నాడని, అహింసను ప్రబోధిస్తున్నాడని దేవుడి చిత్రాన్ని చూపిస్తూ అన్నారు.
మీరు హిందువులే కాదు..
తమను హిందువులుగా చెప్పుకొనే వాళ్లు 24 గంటలూ విద్వేషాన్ని, హింసను, అబద్దాలను వ్యాపింపజేయడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ సభ్యుల వైపు వేలు పెట్టి చూపిస్తూ రాహుల్ అన్నారు. బీజేపీ సభ్యులు ఆగ్రహంతో లేచి నిలబడగానే మీరు హిందువులే కాదు అని మరింత గట్టిగా చెప్పారు. సత్యానికి కట్టుబడి ఉండాలని, వెనక్కి తగ్గొద్దని, సత్యం మాట్లాడటానికి భయపడొద్దని హిందూమతంలో రాసి ఉందన్నారు. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారు. ‘‘ఇది చాలా తీవ్రమైన విషయం. మొత్తం హిందువులను హింసావాదులనడం తీవ్రమైన విషయం’’ అన్నారు. దానికి రాహుల్ బదులిస్తూ, ‘‘బీజేపీ, మోదీయే మొత్తం హిందూ సమాజం కాదు. ఆరెస్సెస్ మొత్తం హిందూ సమాజం కాదు. హిందూత్వాన్ని బీజేపీకి కాంట్రాక్టు రాసివ్వలేదు’’ అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దేవుళ్ల పటాలను సభలో చూపించడం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించడానికి అనుమతి లేదని చెప్పారు. బీజేపీ మైనారిటీలను బెదిరిస్తోందని, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని, హింసను ప్రేరేపిస్తోందని రాహుల్ ఆరోపించారు. సభలో తాను మాట్లాడేటప్పుడు మోదీ ఎందుకు సీరియ్‌సగా ఉంటారని రాహుల్‌గాంధీ ప్రశ్నించగా, విపక్ష నేతను సీరియ్‌సగా తీసుకుంటామని, ఆ పదవిని గౌరవించడం రాజ్యాంగం తనకు నేర్పిందని మోదీ అన్నారు. కాగా, మణిపూర్‌ను అంతర్యుద్ధం స్థాయికి తీసుకెళ్లిన మోదీ ఇంతవరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని రాహుల్ అన్నారు. అగ్నివీర్ పథకంతో సైనికులను వాడుకొని వదిలేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. భారత్ అనే భావన మీద, రాజ్యాంగం మీద బీజేపీ పూర్తి స్థాయిలో ఒక పద్ధతి ప్రకారం దాడి చేస్తోందని రాహల్‌గాంధీ ఆరోపించారు. చాలామంది విపక్ష నేతల మీద వ్యక్తిగత దాడికి పాల్పడ్డారని, కొందరు ఇప్పటికీ జైళ్లలో ఉన్నారని పరోక్షంగా కేజ్రీవాల్ అరెస్టును ప్రస్తావిస్తూ చెప్పారు.
అవసరమైతే మోదీ పాదాలకు నమస్కరిస్తా
సభలో రాహుల్‌కు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మధ్య కూడా సంవాదం జరిగింది. స్పీకర్ తనతో కరచాలనం చేసినపుడు నిటారుగా నిలబడ్డారని, మోదీతో కరచాలనం చేసినపుడు పూర్తిగా తల వంచారని రాహుల్ ప్రస్తావించారు. దాంతో బీజేపీ సభ్యులు భగ్గుమన్నారు. సభాపతి మీదే రాహుల్‌గాంధీ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అమిత్‌షా మండిపడ్డారు. ప్రధాని సభా నాయకుడని, పెద్దలు నేర్పిన విలువలను అనుసరించి, వయసులో తనకన్నా పెద్దవాడైన మోదీకి తలవంచానని స్పీకర్ బదులిచ్చారు. అవసరమైతే పాదాలకు కూడా నమస్కరిస్తానన్నారు. రాహుల్‌గాంధీ స్పీకర్ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా అంటూనే సభలో స్పీకర్ కన్నా ఎవరూ పెద్ద కాదని గుర్తు చేయదలచుకున్నానని చెప్పారు. మొత్తం విపక్షం తరపున స్పీకర్‌కు తల వంచుతున్నానని అన్నారు. అదే సమయంలో స్పీకర్ ఎవరి ముందూ తలవంచరాదని విజ్ఞప్తి చేశారు.