Share News

2024 Elections: లోక్‌సభ ఎన్నికలపై రామ మందిర ప్రధాన పూజారి జోస్యం.. ఏమన్నారంటే?

ABN , Publish Date - Jan 02 , 2024 | 02:59 PM

అయోధ్యలోని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తాజాగా 2024 ఏడాది గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త సంవత్సరం చాలా ముఖ్యమైనదని అన్నారు. ఎందుకంటే..

2024 Elections: లోక్‌సభ ఎన్నికలపై రామ మందిర ప్రధాన పూజారి జోస్యం.. ఏమన్నారంటే?

Acharya Satyendra Das: అయోధ్యలోని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తాజాగా 2024 ఏడాది గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త సంవత్సరం చాలా ముఖ్యమైనదని అన్నారు. ఎందుకంటే.. ఈ ఏడాదిలోనే రామాలయంలోని గర్భగుడిలో రామ్‌లల్లాను ప్రతిష్ఠించడంతో పాటు సాధారణ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ రెండూ శుభప్రదంగా ఉంటాయని పేర్కొన్నారు. నగరంలోని రామ్‌ఘాట్ ప్రాంతంలోని తన నివాసంలో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.


‘‘2024లో శాంతి మాత్రమే కాదు.. రామరాజ్యం వస్తుంది. గర్భగుడిలో రామ్‌లల్లా కూర్చుంటారు. దుఃఖం, బాధ, ఒత్తిడి అన్నీ తీరిపోయి.. అందరూ సంతోషంగా ఉంటారు’’ అని సత్యేంద్ర దాస్ అన్నారు. హోలీ, రామనవమి, బసంత్ పంచమి, స్వాతంత్రం, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో రామ్‌లల్లాకు 56 భోగులు నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పారు. జనవరి 22వ తేదీన రామ్‌లల్లా గర్భగుడిలో కూర్చుంటారు కాబట్టి.. ఈ ఏడాది ప్రతిఒక్కరికీ ఎంతో మహత్తరంగా సాగుతుందని చెప్పారు. 2024 ఎన్నికలు సైతం ఎంతో శుభప్రదంగా సాగుతాయని చెప్పిన ఆయన.. తన హయాంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు.

అంతకుముందు కూడా.. రాముడి పేరుపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని చెప్పడం ఏమాత్రం సరైంది కాదని, అలా చెప్పడం తప్పని సత్యేంద్ర దాస్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి చోటా గౌరవం దక్కుతోందని, రామాలయంపై ఆయనకున్నది భక్తి మాత్రమేనని, రాజకీయం చేయడం లేదని పేర్కొన్నారు. ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని శివసేన (యూబీటీ) నేతలు ఆరోపణలు చేసిన తరుణంలో.. సత్యేంద్ర దాస్ అలా బదులిచ్చారు. ఇదిలావుండగా.. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.

Updated Date - Jan 02 , 2024 | 02:59 PM