Exit polls : ఎగ్జిట్‌పోల్స్.. అటో.. ఇటో..!?
ABN , Publish Date - Jun 01 , 2024 | 05:28 AM
లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్ వెలువడనున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ను సాయంత్రం 6.30 గంటల తర్వాతే విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం
నేటి సాయంత్రం 6.30 గంటల
తర్వాత నమూనా ఫలితాల విడుదల
మీడియా చర్చలను బహిష్కరిస్తున్నాం
4 వరకూ చర్చల్లో పాల్గొనం: కాంగ్రెస్
ఓటమిని ముందే అంగీకరించిన కాంగ్రెస్
నేటి పోలింగ్‌లో ఆ పార్టీకి ఓటు వృథా: నడ్డా
న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్ వెలువడనున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ను సాయంత్రం 6.30 గంటల తర్వాతే విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇక ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించేవారికి ఓటర్లు ఈసారి తమ వాస్తవ మనోగతాన్ని చెప్పే అవకాశం లేదని, గట్టి పోటీ ఉన్నందువల్ల 1-3 శాతం వరకు తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎగ్జిట్‌పోల్స్ నిర్వాహకులు తీసుకునే నమూనాల స్థాయి వల్ల కూడా పొరపాట్లకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఎగ్జిట్‌పోల్స్ విఫలమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2004లో ఇండియా షైనింగ్ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి 240-250 వరకు సీట్లు వస్తాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2009లోనూ ఎగ్టిట్‌పోల్స్ అంచనాలు తప్పాయి. 2015లో ఢిల్లీలో ఆప్ ప్రభంజనం వీస్తుందని ఏ ఎగ్జిట్‌పోల్ కూడా అంచనా వేయలేకపోయింది. అదే ఏడాది బిహార్‌లో కూడా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు భిన్నంగా ఆర్జేడీ- కాంగ్రెస్- జేడీయూ కూటమి ఘన విజయం సాధించింది. 2017లో పెద్దనోట్ల రద్దు అనంతరం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ, బీజేపీ 300 సీట్లకు పైగా సాధించి అధికారంలోకి వచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచ నా వేయలేకపోయాయి. అయితే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు, అసలు ఫలితాలు ఒకేలా వెలువడిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా శనివారం వెలువడే ఎగ్జిట్‌పోల్స్‌పై మీడియా చర్చలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని.. వారి తీర్పు ఈవీఎంల్లో భద్రంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 4న ఈవీఎంలను తెరిచి లెక్కిస్తారని.. ఆ లోపు ఊహాగానాలకు తావివ్వకూడదని తెలిపారు. చానెళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకోవడానికి పెట్టే అవనసర చర్చల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొనబోదని చెప్పారు. 4 వరకూ ఎగ్జిట్‌పోల్స్‌పై జరిగే చర్చల్లో తమ పార్టీ నేతలెవరూ పాల్గొనరని స్పష్టం చేశారు. కాగా, ఎగ్జిట్‌పోల్స్‌పై చర్చలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడమంటే కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని అంగీకరించినట్లేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ ఏడవ దశలో ఆ పార్టీకి ఓటేయడం వృథా అన్నారు.