Share News

మనోళ్ల ఖర్చు ఎక్కువే

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:01 AM

ప్రతినెల కుటుంబ అవసరాలకు మీరు ఎంత ఖర్చుపెడుతుంటారు? గ్రామీణ కుటుంబమైతే ఎంత ఖర్చు పెడతారు?

మనోళ్ల ఖర్చు ఎక్కువే

నెలవారీ కుటుంబ వ్యయం తెలుగు రాష్ట్రాల్లోనే అధికం

తెలంగాణ పట్టణాల్లో రూ.9,131; ఏపీలో 9,877

న్యూఢిల్లీ, డిసెంబరు 28: ప్రతినెల కుటుంబ అవసరాలకు మీరు ఎంత ఖర్చుపెడుతుంటారు? గ్రామీణ కుటుంబమైతే ఎంత ఖర్చు పెడతారు? పట్టణాల్లో ఉండే కుటుంబానిదెంత ఖర్చు? ఆసక్తికరమైన విషయమే కదా ఇది! పట్టణాల్లో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగం (ఎంపీసీఈ)లో తెలుగు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకన్నా ముందున్నాయి. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో కుటుంబాలు నెలకు రూ.9,131 ఖర్చు పెడుతుంటే, ఏపీ పట్టణప్రాంతాల్లో ఈ లెక్క రూ.9,877గా ఉంది. తెలంగాణ పల్లెల్లోని కుటుంబాలు నెలకు రూ.5,675 చొప్పున ఖర్చు చేస్తుంటే.. ఏపీలోనైతే గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,107 ఖర్చు చేస్తున్నాయి. దేశంలో పేదరికం, ఆసమానతలు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు ‘గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24’ పేరుతో 2023 ఆగస్టు-2024 జూలై మధ్య రాష్ట్రాలవారీగా ఓ సర్వే నిర్వహించారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,54,357 మంది నుంచి, పట్టణ ప్రాంతాల్లో 1,07,596 మంది నుంచి వివరాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కుటుంబాలు నెలవారీగా పెడుతున్న ఖర్చులో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు నెలవారీ తలసరి వినియోగానికి చేస్తున్న ఖర్చులు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండడం విశేషం.


సర్వే విశేషాలు ఇవీ..

కేరళ:గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.6,611 ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.7834 ఖర్చు చేస్తున్నారు.

తమిళనాడు: గ్రామీణ కుటుంబాలు రూ.5,872 ఖర్చు పెడుతుండగా, పట్టణాల్లోని కుటుంబాలు రూ.8,325 ఖర్చు చేస్తున్నాయి.

కర్ణాటక: పట్టణ ప్రాంతాల్లో రూ.8,169 ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఖర్చు నెలకు రూ.5,068గా ఉంది.

జాతీయ స్థాయి: గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఖర్చు రూ.4,122, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు రూ.6,996 ఖర్చు చేస్తున్నారు.

పారిశ్రామిక రాష్ట్రాలు: పారిశ్రామిక రాష్ట్రాలుగా పేరొందిన గుజరాత్‌, మహారాష్ట్రలలో జాతీయ సగటుకు కొంత అంటు ఇటుగా కుటుంబాల నెలవారీ ఖర్చులు ఉన్నాయి.

Updated Date - Dec 29 , 2024 | 04:01 AM