Task force : వైద్యుల భద్రతకు టాస్క్‌ఫోర్స్!
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:01 AM
ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టీఎ్‌ఫ)ను ఏర్పాటు చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన
తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు
3 వారాల్లో మధ్యంతర, 2 నెలల్లో పూర్తి నివేదిక
కోల్‌కతా హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు ఆదేశం
మీ భద్రతపై మాది భరోసా.. మమ్మల్ని నమ్మండి ప్లీజ్
ఆందోళనలు విరమించి.. రోగులకు సేవలందించండి
వైద్యులకు అత్యున్నత న్యాయస్థానం పిలుపు
నేరస్థుడు పశువులా వ్యవహరించాడు..
హత్యాచార ఘటన భయానకమంటూ వ్యాఖ్యలు!
టాస్క్‌ఫోర్స్‌లో ఏఐజీ సీఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
బడిలో చిన్నారులపై లైంగికదాడి
మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఘటన
స్థానికుల ఆగ్రహం.. పాఠశాల ధ్వంసం, రైల్ రోకో
న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టీఎ్‌ఫ)ను ఏర్పాటు చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టాస్క్‌ఫోర్స్‌లో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డికి చోటు కల్పించింది. పని ప్రదేశాల్లో వైద్యులపై లైంగిక పరమైన హింసను నివారించేందుకు.. వైద్యులు, నర్సులకు భద్రత, గౌరవప్రదమైన పరిస్థితులు కల్పించడానికి జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఎన్‌టీఎ్‌ఫకు నిర్దేశించింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్, తన మధ్యంతర నివేదికను మూడు వారాల్లోగా.. పూర్తిస్థాయి నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది. టాస్క్‌ఫోర్స్‌కు కేంద్ర క్యాబినెట్, హోంశాఖ, ఆరోగ్యశాఖ కార్యదర్శులు.. జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) చైర్‌పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారని ధర్మానం పేర్కొంది. వైద్యులపై భౌతికదాడులు, లైంగిక హింసకు సంబంధించి వైద్యసంస్థలు తమకు తాము ఎలాంటి నిబంధనలను రూపొందించుకోకపోవడం తీవ్ర ఆందోళనకరం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఽత్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. వైద్యుల భద్రత కోసం చట్టాలు ఉన్నాయని.. అయితే అవి వ్యవస్థాగత సమస్య (సిస్టమెటిక్ ఇష్యూ్‌స)లను పరిష్కరించలేవు అని వ్యాఖ్యానించింది. పనిచేసే చోట వైద్యులకు భద్రతాలేమిపై సుప్రీం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందదుకు మరో అత్యాచారమో.. హత్యో జరిగేదాకా ఎదురుచూడకూడదు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ వైద్యురాలి పేర్లు, ఫొటోలు, వీడియోలను తక్షణమే సామాజిక మాధ్యమాల్లోంచి తొలగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న వైద్యులు.. ఆందోళనలను విరమించి, ఎప్పటిలాగే వైద్యసేవలు కొనసాగించాలని అప్పీలు చేసింది. వైద్యుల సమ్మెతో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొంది. ‘‘వైద్యుల భద్రతపై భరోసా కల్పించేందుకు మేం ఉన్నాం.. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి’’ అని వైద్యులను ఉద్దేశించి పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఢిల్లీలోని ఆర్‌ఎంల్ ఆస్పత్రి వైద్యులు తమ సమ్మెకు ముగింపు పలికారు. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించడాన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్వాగతించింది. మరోవైపు.. ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపేందుకు స్వామి వివేకానంద స్టేట్ పోలీస్ అకాడమీ ఐజీ డాక్టర్ ప్రణవ్ కుమార్ సారత్యంలో నాలుగు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
టాస్క్‌ఫోర్స్ సభ్యులు వీరే
1. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి, ఏవీఎ్‌సఎం, వీఎ్‌సఎం, డీజీ, మెడికల్ సర్వీసెస్ (నేవీ)
2. డి.నాగేశ్వర్‌రెడ్డి, చైర్మన్, ఎండీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ర్టోఎంటరాలజీ, ఏఐజీ హాస్పిటల్స్
3. ఎం.శ్రీనివాస్, ఎయిమ్స్(ఢిల్లీ) డైరెక్టర్
4. ప్రతిమామూర్తి, నిమ్‌హన్స్ డైరెక్టర్, బెంగళూరు
5. గోవర్థన్ దత్ పూరి, ఎయిమ్స్(జోధ్‌పూర్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
6. సౌమిత్రా రావత్, మెంబర్, బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సర్ గంగారామ్ హాస్పిటల్
7. ప్రొఫెసర్ అనితా సక్సేనా, వైస్ ఛాన్సలర్, పండిట్ బీడీ శర్మ మెడికల్ యూనివర్సిటీ, రోహ్‌తక్
8. పల్లవి సప్లే, డీన్, గ్రాంట్ మెడికల్ కాలేజ్,జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ముంబై
9. పద్మా శ్రీవాస్తవ,గతంలో ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం ప్రొఫెసర్.
అరుణా షాన్‌బాగ్‌ను ప్రస్తావించిన సీజేఐ
న్యూఢిల్లీ, ఆగస్టు 20: కోల్‌కతా హత్యాచారం అంశంపై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. అరుణా షాన్‌బాగ్ ఉదంతాన్ని ప్రస్తావించారు. 1973 నాటి ఈ ఘటన అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేసే అరుణా షాన్‌బాగ్‌పై 1973 నవంబరు 27వ తేదీ రాత్రి ఆస్పత్రిలోని వార్డు బాయ్ సోహన్‌లాల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె మెడకు.. కుక్కలను కట్టివేయటానికి ఉపయోగించే గొలుసు వేసి బిగించటంతో.. అరుణ మెదడు తీవ్రంగా దెబ్బతిన్నది. నాటి నుంచి 2015లో మరణించేవరకూ అరుణ అచేతనస్థితిలో (పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్) ఉండిపోయారు. అదే ఆస్పత్రిలో పని చేసే సందీప్ సర్దేశాయ్ అనే డాక్టర్‌తో నిశ్చితార్థం జరిగి, మరికొన్ని నెలల్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాల్సిన అరుణా షాన్‌బాగ్ జీవితం ఈ దారుణ ఘటనతో సర్వనాశనమైపోయింది. అయితే, ఆస్పత్రి సిబ్బంది నాలుగు దశాబ్దాలపాటు ఆమెకు సేవలు అందించి ప్రాణాలు నిలబెట్టారు. అరుణ నిమోనియాతో 2015 మే 18న మరణించారు. ఆమె జీవితాన్ని నాశనం చేసిన వార్డు బాయ్ సోహన్‌లాల్ కేవలం ఏడేళ్లపాటు జైలులో ఉండి 1980లో విడుదలయ్యాడు. ఆస్పత్రిలో జరిగే వైద్య ప్రయోగాల్లో ఉపయోగించే కుక్కల కోసం తీసుకొచ్చే ఆహారాన్ని సోహన్‌లాల్ దొంగిలిస్తుండటంతో అరుణ అతడిని మందలించి, అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దీనిపై కక్షతో ఆమెపై సోహన్‌లాల్ ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు.