Share News

Sarayu River: సరయూ నదీ తీరం జిగేల్‌

ABN , Publish Date - Jan 14 , 2024 | 10:51 AM

అయోధ్యలో రామమందిరానికి ఈనెల 22న ప్రాణప్రతిష్ఠ జరపనున్న సందర్భంగా సరయూ నది తీరాన్ని ప్రమిదలు, బాణసంచా కాంతులతో జిగేల్‌ మనిపించనున్నారు. ఆలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈనెల 18 నుంచి ఆ ప్రాంతంలో ప్రైవేటు భవనాల నిర్మాణాలపై నిషేధం అమలు చేస్తున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Sarayu River: సరయూ నదీ తీరం జిగేల్‌

- రామమందిర ప్రారంభం సందర్భంగా వెలుగులు

- ముఖ్య కూడళ్లలో రామచరిత మానస్‌ శ్లోకాల హోర్డింగులు

అయోధ్య, జనవరి 13: అయోధ్యలో రామమందిరానికి ఈనెల 22న ప్రాణప్రతిష్ఠ జరపనున్న సందర్భంగా సరయూ నది తీరాన్ని ప్రమిదలు, బాణసంచా కాంతులతో జిగేల్‌ మనిపించనున్నారు. ఆలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈనెల 18 నుంచి ఆ ప్రాంతంలో ప్రైవేటు భవనాల నిర్మాణాలపై నిషేధం అమలు చేస్తున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. భక్తులకు పర్యాటక ప్రదేశాల సమాచారం తెలియజేసేందుకు 250 మంది వరకు పోలీసు గైడ్‌లను నియమించినట్టు చెప్పారు. దీంతోపాటు డిజిటల్‌ టూరిస్ట్‌ యాప్‌ను ఆదివారం ప్రారంభించనున్నారు. అయోధ్యలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ విద్యుత్‌ కాంతులతో అలంకరించనున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో రామచరిత మానస్‌ శ్లోకాలతో హోర్డింగ్‌లను, తప్పిపోయినవారి కోసం ‘లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌’ కేంద్రాలను సమాచార శాఖ ఏర్పాటు చేయనుంది. అత్యాధునిక 4కే సాంకేతికతతో వివిధ డీడీ ఛానళ్లలో వివిధ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు కేంద్ర సమాచార, ప్రసారమాధ్యమాలశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. కాగా, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లరాదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ నిర్ణయించారు. తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయోధ్య రామాలయ ట్రస్టు ప్రధానకార్యదర్శి చంపత్‌ రాయ్‌కు ఆయన శనివారం లేఖ రాశారు. ప్రారంభోత్సవం జరిగాక కుటుంబంతో కలిసి రామమందిరానికి వస్తానని లేఖలో ఆయన తెలిపారు.

Updated Date - Jan 14 , 2024 | 10:51 AM