Share News

Supreme Court: జైళ్లలో కుల వివక్షపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు

ABN , Publish Date - Oct 03 , 2024 | 01:28 PM

జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Supreme Court: జైళ్లలో కుల వివక్షపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు

ఢిల్లీ: జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి చర్యలు అంటరానితనం కిందకే వస్తాయని పేర్కొంది. కులం ఆధారంగా ఖైదీలను వేరుగా ఉంచడం మార్పు తీసుకురాదని, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించడం వలసవాద వ్యవస్థకు చిహ్నమని వెల్లడించింది.


ఆర్టికల్ 15 ఉల్లంఘనే..

"కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనులను అప్పగిస్తున్నారు. జైలులో గదుల కేటాయింపునకు సంబంధించిన నిబంధనలు సరికావు. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే క్లీనింగ్ పనులు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. కింది కులాల ఖైదీలకు మాత్రమే శుభ్రపరిచే పని, అగ్రవర్ణ ఖైదీలకు వంట పనులు ఇవ్వడం ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమే. అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మూడు నెలల్లో మార్చాలి. ఈ నిర్ణయం అమలుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టులో సమర్పించాలి" అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.


ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఖైదీలపై వివక్షకు కులం కారణం కారాదని, అలాంటి వాటిని అనుమతించేది లేదని తెలిపింది. పని విషయంలో అందరికీ సమాన హక్కు కల్పించాలని వివరించింది. ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించింది. ఒక కులం వారినే స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని వివరించింది.

Gold Prices Today: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగాయ్

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

Naga Chaitanya: సిగ్గు.. సిగ్గు.. సురేఖ కామెంట్స్‌పై నాగచైతన్య మండిపాటు

Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే


For Latest News and Telangana News click here

Updated Date - Oct 03 , 2024 | 01:28 PM