Share News

సోషల్‌ రిలేషన్‌.. పార్టీ ప్రమోషన్‌

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:26 AM

సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని పార్టీలూ అందరినీ చేరువ చేసుకుంటాయి. ప్రతి ఒక్కరినీ తమ వారిగానే భావిస్తాయి.

సోషల్‌ రిలేషన్‌.. పార్టీ ప్రమోషన్‌

యూట్యూబర్లు, సోషల్‌ మీడియా దిగ్గజాలతో పార్టీల అగ్ర నేతల ప్రత్యేక సంబంధాలు

పార్టీలను ప్రమోట్‌ చేసే వ్యూహాలు

సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని పార్టీలూ అందరినీ చేరువ చేసుకుంటాయి. ప్రతి ఒక్కరినీ తమ వారిగానే భావిస్తాయి. ఇప్పుడు ఈ జాబితాలో సమాజాన్ని ప్రభావితం చేసే యూట్యూబర్లు, ప్రముఖులు, ఆవిష్కర్తలు, సృష్టికర్తలు వంటివారు చేరిపోయారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ వరకు అన్ని పార్టీలదీ ఇప్పుడు ఆయా ప్రభావ వంతమైన వ్యక్తులను తమవైపు తిప్పుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. నాయకుల విషయానికి వస్తే ప్రధాని మోదీ నుంచి విపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ వరకు ఈ ప్రభావవంతమైన వ్యక్తులను అక్కున చేర్చుకునేందుకు ఉత్సాహం చూపించారు. గత నెల మార్చిలో ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డ్స్‌’ ప్రదానోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘మరికొద్ది రోజుల్లోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని దానికోసమే నిర్వహిస్తున్నామని భావించొద్దు’’ అని అన్నారు. ఈ సమయంలో సభలో ఉన్న వారు ‘‘అబ్కీ బార్‌, 400 పార్‌’’ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఇక, అవార్డులకు ఎంపికైన విభాగాల్లో బెస్ట్‌ డిస్రప్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఒకటి. ఈ అవార్డును రణ్‌వీర్‌ అల్లాబాదియాకు ప్రదానం చేశారు. రణ్‌వీర్‌ ‘బీర్‌ బైసెప్స్‌’ ద్వారా ప్రాచుర్యం పొందారు. ఇక, స్వచ్ఛత అంబాసిడర్‌ అవార్డును మల్హార్‌ కలాంబేకు అందించారు. అదేవిధంగా ‘బెస్ట్‌ క్రియేటర్‌ ఇన్‌ ఫుడ్‌’ విభాగంలో కబితా సింగ్‌కు అవార్డును ప్రదానం చేశారు. ‘కబితాస్‌ కిచెన్‌’ ద్వారా కబితా సింగ్‌ ప్రాచుర్యం పొందారు. బెస్ట్‌ ట్రావెల్‌ క్రియేటర్‌ అవార్డును కమియా జానీకి అందించారు. ‘కర్లీ టేల్స్‌’ ద్వారా జానీ ప్రాచుర్యం పొందారు. ఇక, బెస్ట్‌ హెల్త్‌, ఫిట్‌నెస్‌ క్రియేటర్‌ అవార్డును అంకిత్‌ బైయాన్‌పురియాకు అందించారు. ఇలా.. సమాజాన్ని ప్రభావితం చేసేవారిని ఎంపిక చేసి జాతీయ అవార్డులు అందించడం ఇదే తొలిసారి. తద్వారా బీజేపీ ప్రభుత్వం కీలకమైన లోక్‌సభ ఎన్నికల వేళ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి.

భారీ వ్యూహమే: బీజేపీ నేత

దేశంలో తొలిసారి నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డులను ప్రదానం చేయడం వెనుక భారీ వ్యూహమే ఉందని మహారాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడు దేవాంగ్‌ దవే అన్నారు. సోషల్‌ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులు ప్రజల అభిప్రాయాలను కూడా మార్చగలరని ఆయన అభిప్రాయపడ్డారు. వీరి కథనాలు తమ ప్రచారంలో కీలకంగా మారనున్నాయని వెల్లడించారు. ఇవి 2024 ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించనున్నాయని ఆయన వెల్లడించారు. ‘‘సంప్రదాయ మీడియా కూడా కొన్ని కొన్నిసార్లు ప్రజలను ప్రభావితం చేయలేకపోవచ్చు. కానీ, సామాజిక మాధ్యమాల్లో దూకుడుగా ఉండే వారు.. రాజకీయ సందేశాల ద్వారా ప్రజలను ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది’’ అని అన్నారు.

కాంగ్రెస్‌ కూడా..

సోషల్‌ మీడియాలో ప్రభావవంతమైన వ్యక్తులతో అనుబంధం పెంచుకునే విషయంలో కాంగ్రెస్‌ కూడా ముందుంది. రాహుల్‌ గాంధీ.. తన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ప్రముఖ యూట్యూబర్‌ కామియా జానీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదే. అదేవిధంగా తమిళనాడుకు చెందిన ‘విలేజ్‌ కుకింగ్‌ చానెల్‌’ యూట్యూబ్‌ చానెల్‌ ప్రతినిధులతోనూ రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. వారితో కలిసి వంట చేశారు. కలిసి భోజనం కూడా చేశారు. ఇవన్నీ సోషల్‌ మీడియాలో జోరుగా వైరల్‌ కావడంతోపాటు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

- సెంట్రల్‌ డెస్క్‌

ప్రధానితో బంధం

సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేసే వారితో ప్రధాని మోదీ వ్యక్తిగత అనుబంధం పెంచుకున్నారు. సోషల్‌ మీడియా ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌, హరియాణాకు చెందిన అంకిత్‌ బైయాన్‌పురియాతో 2023, అక్టోబరు 2న ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సమయంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘శ్రమదాన్‌’లో అంకిత్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని తన ‘ఎక్స్‌’(ట్విట్టర్‌)లో పోస్టు చేశారు. దీనిని లక్షల మంది సోషల్‌ మీడియా ఫాలోవర్లు వీక్షించడం గమనార్హం.

Updated Date - Apr 07 , 2024 | 03:26 AM